అనంతపురం కార్పొరేషన్: వడగండ్ల వాన, ఈదురు గాలులతో పంటలు దెబ్బతిని ఉద్యాన రైతులు అంతులేని ఆవేదనలో మునిగిపోయారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లో అరటి, మొక్కజొన్న, దానిమ్మ, బొప్పాయి తదితర ఉద్యాన పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రూ.35 కోట్లకుపైగా నష్టం జరిగిందన్నారు. అప్పులు చేసి పంటలు సాగు చేస్తే చేతికందాల్సిన పంట నేలనంటడంతో అన్నదాతల ఆవేదన అంతా ఇంతా కాదన్నారు. ఫిబ్రవరిలో అరటి టన్ను రూ.25,000 వరకు ఉంటే ప్రస్తుతం ధరలు పడిపోయాయని తెలిపారు. ఇలాంటి తరుణంలో పెట్టుబడులు కూడా దక్కే సూచనలు కన్పించడం లేదన్నారు. అధికార యంత్రాంగం సమగ్రంగా నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నారు. యల్లనూరు మండలం నీర్జాంపల్లికి చెందిన అరటి రైతులు లక్ష్మీనారా యణ, చిన్న వెంగప్ప ఆత్మహత్యకు యత్నించడం బాధాకరమని, ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఎన్నికల సమయంలో పెట్టుబడి సాయంగా రూ.20,000 ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. తీరా అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది పెట్టుబడి సాయం కూడా అందించలేదన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో అమలు చేసిన ఉచిత పంట బీమా పథకం రైతాంగాన్ని ఆదుకుందని, అలాంటి పథకానికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడిందని విమర్శించారు.