అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం రూరల్ మండలం పాపంపేట 106–1 సర్వే నంబరు విద్యారణ్యనగర్‌లోని 68 సెంట్లలో పేదల ఇళ్ల కూల్చివేత కేసులో స్టేటస్ కో ఇచ్చి కబ్జాకోరులకు న్యాయ దేవత చెంపదెబ్బ కొట్టిందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 68 సెంట్లలో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని, లావాదేవీలు, ఆన్‌లైన్ రికార్డుల్లో ఎలాంటి మార్పులు జరగకూడదని, రిజిస్ట్రేషన్లు చేయకూడదని కోర్టు స్పష్టం చేసిందన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ చట్టానికి సంబంధించి షెడ్యూలు మునిసిపల్ పరిధిలో ఉందని, అలాంటి షెడ్యూల్ ప్రాపర్టీని నారాయణపురం పంచాయతీలో ఉందని మార్చడానికి తహసీల్దార్ ఎవరు? అని జడ్జి ప్రశ్నించినట్లు తెలిపారు. స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి రెవెన్యూ అధికారులతో కుట్ర చేసి కోర్టును తప్పుదోవపట్టించి 40 ఏళ్లుగా కాపురాలు ఉంటున్న ఇళ్లను కూల్చివేయడం అనేది ఘోర సంఘటన అన్నారు. అవినీతిపరురాలు ప్రజాప్రతినిధిగా ఉంటే ఎలాంటి నేరాలు, ఘోరాలు చేయొచ్చో ఈరోజు అందరూ గమనిస్తున్నారన్నారు.
పరిటాల రవీంద్ర హయాంలోనే...
పరిటాల రవీంద్ర హయాంలో 1995–96 ప్రాంతంలో నగరంలో మేదరవాండ్ల కొట్టాలును కూల్చి షాపింగ్ కాంప్లెక్స్ సముదాయాన్ని నిర్మించుకున్నారని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఆర్యవైశ్యులను బెదిరించి తక్కువ ధరకు భూమి కొని ఇల్లు కట్టుకున్నారన్నారు. శాంతి థియేటర్ పక్కన కృష్ణాభవన్ ఆస్తి అన్నదమ్ముల పంచాయితీలో ఉండగా, అందులో తలదూర్చి నామమాత్రపు ధరకి భూమి కొట్టేసి పెద్ద ఎత్తున కాంప్లెక్స్ కట్టుకున్నారన్నారు. అదే పరిటాల కుటుంబం ఈరోజు 68 సెంట్ల ఆక్రమించాలని చూస్తున్నారని ఆరోపించారు. శోత్రియందారులకు నామమాత్రపు ధర చెల్లించి పేదల ఇళ్లను కూల్చి వేయించాలని చూశారన్నారు. అక్కడ పెద్ద ఎత్తున షాపింగ్ కాంప్లెక్స్, ప్రైవేట్ నర్సింగ్‌హోం నిర్మించాలని చూస్తున్నారన్నారు. పరిటాల సునీత ఆక్రమణదారు, ఒక కబ్జాకోరు అని మండిపడ్డారు. ఆమె కన్ను ఈ ప్రాంతంపై పడింది కాబట్టే 180 ఎకరాల శోత్రియం భూములను బంధువులు, అనుచరులు జీపీఏ చేయించుకున్నారన్నారు. 450 మందికి నోటీసులు ఇప్పించారన్నారు. ‘ఇక్కడ ఇళ్లు కూల్చి వేయించాం... ఇక మీదే’ అంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. 2016–17 ప్రాంతంలోనూ విద్యారణ్యనగర్‌లో 400 ఇళ్లకు సంబంధించిన భూమి తాము కొనుగోలు చేశామంటూ దాదాపు రూ. 10 కోట్లు పేదల నుంచి వసూళ్లు చేశారన్నారు. ఇంత డబ్బు వసూలు చేసికూడా పరిటాల రవీంద్రనగర్ అని బోర్డు పెట్టించారని దుయ్యబట్టారు.
అధికారులను దోషులుగా నిలబెడతాం
68 సెంట్ల స్థలాలపై తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ హైకోర్టు ఇదే తీర్పు ఇచ్చిందన్నారు. పేదలకు అండగా ఉంటానని ఇచ్చిన మాట ప్రకారం అప్పటి కలెక్టర్‌తో ప్రత్యేకంగా మాట్లాడి కౌంటర్ దాఖలు చేయగలిగామన్నారు. ఆధారాలతో కోర్టులో వాదనలు వినిపించేసరికి వారు పలాయన మంత్రం పఠించారన్నారు. పేదలకు వైఎస్సార్ కాంగెస్ పార్టీ గతంలో అండగా నిలిచిందని, ఇప్పుడూ ఉంటుందని, భవిష్యత్తులోనూ నిలబడుతుందన్నారు. ఈ దుర్మార్గానికి కారకులైన అధికారులు తప్పనిసరిగా సమాధానం చెపాల్సిన రోజు వస్తుందన్నారు. న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెడతామని ప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. సమావేశంలో రూరల్ ఎంపీపీ వరలక్ష్మీ, జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, కన్వీ నర్ పవన్, మాజీ కన్వీనర్ గోపాల్‌రెడ్డి, నాయకులు నీరుగంటి నారాయణరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్వర్లు, సందీప్‌యాదవ్, పాపంపేట నాయకులు ఆకుల మునిశంకరయ్య, మాదన్న, కుమ్మెత గోపాల్‌రెడ్డి, గోపి, ఎర్రిస్వామి, అంజనరెడ్డి, రమేష్, రాజమ్మ, ప్రమీల పాల్గొన్నారు.
విద్యారణ్యనగర్‌లోని 68 సెంట్ల స్థలంపై కోర్టు స్టేటస్ కో
నిర్మాణాలు, లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు చేయరాదని ఆదేశాలు
అధికారులు తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి