అనంతపురం ఎడ్యుకేషన్: ప్రాథమికోన్నత పాఠశాల వ్యవస్థను రద్దు చేసే దిశగా విద్యారంగ సంస్కరణలు ఉన్నాయని, ఫలితంగా విద్యకు బాలికలు దూరమవుతారని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య మాట్లాడారు. ప్రభుత్వ బడిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు సమాజమూ తీసుకోవాలన్నారు. విద్యారంగ సంస్కరణల పేరుతో జీఓ 117 రద్దు చేసి ప్రత్యామ్నాయంగా మరో జీఓ తేవడానికి రాష్ట్రం ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతోందన్నారు. ఈ సంస్కరణలతో 1, 2 తరగతులు మాత్రమే ఉన్న ఫౌండేషన్ పాఠశాలలు 20వేలకు పైగా పెరుగుతాయన్నారు. భవిష్యత్తులో ఈ పాఠశాలలు మూత పడతాయన్నారు. మోడల్ ప్రాథమిక పాఠశాలల పేరుతో మిగిలిన ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను మ్యాపింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. పాఠశాలల విలీనానికి స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ద్వారా బలవంతంగా తీర్మానాలు చేయించడం సరికాదన్నారు. పాఠశాలలను తగ్గించడం కాకుండా పిల్లల అభివృద్ధి కోణంలో సంస్కరణలు ఉండాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి గ్రామపంచాయతీలో మోడల్ ప్రైమరీ పాఠశాల ఏర్పాటు చేయాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియం, ప్లస్ టు పాఠశాలలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు రమణయ్య, సహాధ్యక్షులు రామప్ప, సరళ, జిల్లా కార్యదర్శులు సంజీవ్ కుమార్, శేఖర్, సుబ్బరాయుడు, ఆడిట్ కమిటీ కన్వీనర్ చంద్రమోహన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దేవేంద్రమ్మ పాల్గొన్నారు.