● ముగిసిన నృసింహుని బ్రహ్మోత్సవాలు
కదిరి: పక్షం రోజుల పాటు సాగిన ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి పుష్పయాగోత్సవంతో ముగిశాయి. ఈ ఉత్సవం కనుల పండువగా, అత్యంత వైభవంగా సాగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగేందుకు సహకరించిన అష్ట దిక్పాలకులు, పంచ భూతాలు, దేవతా మూర్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని.. వారి వారి లోకాలకు సాగనంపేందుకు నిర్వహించేదే ఈ పుష్పయాగోత్సవమని ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు వివరించారు. తీర్థవాది ఉత్సవం ముగియగానే శనివారం సాయంత్రం నుంచి ఆలయం తలుపులు మూసివేసిన విషయం తెలిసిందే. తిరిగి ఆదివారం వేకువ జామునే ఆలయ ద్వారాలు తెరిచి మహా సంప్రోక్షణ గావించారు. అనంతరం స్వామివారికి నిత్య పూజాది కైంకర్యాలను నిర్వహించిన మీదట భక్తులకు ఆలయంలో శ్రీవారి సర్వ దర్శన భాగ్యం కలిగించారు. రాత్రి రంగమండపంలో శ్రీదేవి, భూదేవిల సమేత శ్రీవారిని కర్ణాటక నుంచి తెప్పించిన పుష్పాలతో అలంకరించారు. ఉత్సవానికి ఉభయ దారులుగా రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పూల అశ్వర్థనారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
నకిలీ విత్తనాలతో
మోసపోయిన రైతులు
బ్రహ్మసముద్రం: నకిలీ విత్తనాలతో రైతులు మరోసారి దగాపడ్డారు. కర్ణాటక సరిహద్దు గ్రామాల రైతులను లక్ష్యంగా చేసుకుని రైతులను కంపెనీ ప్రతినిధులు నిట్టనిలువునా ముంచేశారు. బాధిత రైతులు తెలిపిన మేరకు.. తమ కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తన సీడ్స్‌ను సాగు చేస్తే అధిక లాభాలు అందజేస్తామని ఇటీవల ప్రముఖ లెవెన్ గ్రీన్ కావేరీ సీడ్స్ కంపెనీ ప్రతినిధులు బ్రహ్మసముద్రం మండలం మామడూరు గ్రామానికి చెందిన పలువురు రైతులను ఊరించారు. దీంత ఒక్కో ఎకరాకు రూ.30 వేలు చొప్పున పెట్టుబడి పెట్టి పలువురు రైతులు 30 ఎకరాల్లో సదరు కంపెనీ విత్తనాలను సాగు చేశారు. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత కోత కోసి చూస్తే అన్ని బోడికంకులే కావడంతో రైతుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఇదే విషయాన్ని బాధిత రైతులు కంపెనీ ఏజెంట్లకు ఫోన్ చేసి తెలిపితే తమకు సంబంధం లేదని వారు చేతులెత్తేశారు. లెవెన్ గ్రీన్ కావేరి సీడ్స్ కంపెనీ ఏజెంట్లు తమను మోసం చేశారని, తమకు న్యాయం చేయాలంటూ రైతులు వేడుకుంటున్నారు.
కనుల పండువగా పుష్పయాగోత్సవం