రాప్తాడురూరల్: కూటమి ప్రభుత్వంలో ‘తమ్ముళ్ల’ ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ భూములను కబ్జా చేసేస్తున్నారు. అధికారులు నోటీసులిస్తున్నా లెక్కచేయడం లేదు. అనంతపురం రూరల్ మండలం చిన్నంపల్లి పంచాయతీ సంతోష్‌నగర్‌లో అంగన్‌వాడీ కేంద్రం కోసం కేటాయించిన స్థలాన్ని ఓ టీడీపీ చోటా నాయకుడు దురాక్రమణ చేయడమే ఇందుకు నిదర్శనం. వివరాలు.. సంతోష్‌నగర్ ఆంజనేయస్వామి గుడి వద్ద దాదాపు 6 సెంట్ల స్థలాన్ని ప్రజా ప్రయోజనార్థం వదిలిపెట్టారు. ఈ స్థలంలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి 2020 అక్టోబరు 18న పంచాయతీ తీర్మానం చేసింది. ఇక్కడ ప్రైవేట్ భూమి సెంటు రూ.9 లక్షలు పలుకుతోంది. ‘కూటమి’ ప్రభుత్వం వచ్చాక చిన్నంపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఈ స్థలంపై కన్నేశాడు. రెండు సెంట్ల స్థలంలో నిర్మాణ పనులు ప్రారంభించాడు. సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి వెళ్లి నోటీసులు ఇవ్వగా.. ఏమాత్రం లెక్క చేయలేదు. ఎంపీడీఓ, కలెక్టర్‌తో మాట్లాడుకుంటానంటూ కార్యదర్శితో వాదించాడు. ఇటీవల కొందరు కాలనీవాసులు కలెక్టర్ వినోద్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేయగా.. కలెక్టర్ ఆదేశాలతో ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి వెళ్లి నోటీసులు ఇచ్చాడు. అయితే తనకు తహసీల్దార్ మంజూరు చేశారంటూ నకిలీ పట్టా చూపించడం గమనార్హం. దీనిపై ఎంపీడీఓ దివాకర్‌ను వివరణ కోరగా... ‘సంతోష్‌నగర్‌లో ఓపెన్ స్థలంలో ఓ వ్యక్తి ఇల్లు నిర్మిస్తున్నాడు. పంచాయతీ కార్యదర్శి నోటీసు ఇచ్చారు. అక్కడ అంగన్‌వాడీ కేంద్రం భవనం నిర్మాణానికి పంచాయతీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం కూడా చేశారు. అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తాం’ అని స్పష్టం చేశారు.