తాడిపత్రి: ఎస్సీ వర్గానికి చెందిన తల్లి, కుమార్తె మృతదేహాలను శ్మశానంలో ఖననం చేయకుండా అడ్డుకుని టీడీపీ నాయకుడు పైశాచికం ప్రదర్శించాడు. పైగా అధికారులు, పోలీసులు కూడా అతనికే వత్తాసు పలకడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. వివరాలు.. తాడిపత్రి మండలంలోని ఇగుడూరు గ్రామానికి చెందిన తల్లీకుమార్తెలు పుల్లమ్మ, సువార్తమ్మలు అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఈ క్రమంలో శనివారం మృతదేహాలను ఖననం చేసేందుకు శ్మశానవాటికకు తీసుకెళ్తుండగా, అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నరిసిరెడ్డి అడ్డుకున్నాడు. రెవెన్యూ, పోలీసు అధికారులను సైతం పిలిపించి, ఖననానికి శ్మశానంలో స్థలం లేదని చెప్పించారు. ఈ క్రమంలో అధికారులు, పోలీసులతో మృతుల కుటుంబ సభ్యులు, స్థానిక ఎస్సీలు గొడవకు దిగారు. తల్లి, కుమార్తె మృతదేహాలను ఖననం చేశారు. కాగా, ఇగుడూరు గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు 55 ఉన్నాయి. వీరి కోసం శ్మశాన స్థలాన్ని కేటాయించాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించినా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో సమస్యలు తలెత్తుతున్నాయని ఎస్సీలు వాపోయారు. ఈ విషయంపై తాడిపత్రి తహసీల్దార్ రజాక్‌వలి మాట్లాడుతూ గతంలో ఎస్సీలకు కేటాయించిన శ్మశానవాటిక స్థలాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఇది వరకే ఆదేశించారన్నారు. కానీ గ్రామంలో ఎక్కడా ప్రభుత్వ స్థలాలు లేవని చెప్పారు. ప్రయివేట్ స్థలం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపామని, అనుమతులు లభించగానే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ చెప్పారు.
తల్లి, కుమార్తె మృతదేహాలు ఖననం చేయకుండా అడ్డగింత
అధికారులు, పోలీసులూ వత్తాసు పలకడంపై సర్వత్రా విమర్శలు