అనంతపురం: ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగా విజిలెన్స్ అధికారులు, ‘ఈగల్’ అధికారులు తదితరులు సంయుక్తంగా శుక్రవారం అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఏడు మెడికల్ షాపులపై దాడులు చేశారు. హిందూపురంలో ఒక మెడికల్ షాపులో కాలం చెల్లిన ఔషదాలను గుర్తించారు. నాలుగు షాపుల్లో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కలిగించే (ఎన్‌ఆర్‌ఎక్స్) మందుల కొనుగోలు, అమ్మకాలలో వ్యత్యాసాలు గుర్తించినట్లు అనంతపురం ప్రాంతీయ నిఘా, అమలు అధికారి వైబీపీటీఏ ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ డీఎస్పీ ఎం.నాగభూషణం, సీఐలు జమాల్‌బాషా, సద్గురుడు, ఏఓ వాసుప్రకాష్, డీసీటీఓ సురేష్‌కుమార్, ఔషధ నియంత్రణ అధికారి రమేష్‌రెడ్డి, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ హనుమన్న తదితరులు పాల్గొన్నారు.
ఏపీ అగ్రోస్
జిల్లా మేనేజర్‌గా ఓబుళపతి
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఏపీ ఆగ్రికల్చర్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్– ఏపీ అగ్రోస్) జిల్లా మేనేజర్‌గా సి.ఓబుళపతి నియమితులయ్యారు. శుక్రవారం స్థానిక అగ్రోస్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకూ రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి వద్ద ఉన్న భూసార సంరక్షణ విభాగం (సాయిల్ కన్సర్వేషన్) ఏడీగా ఆయన పనిచేశారు. గతంలో అగ్రోస్ జిల్లా మేనేజర్‌గా పనిచేసిన అనుభవం ఉన్నందున తిరిగి ఆయనకే బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల వ్యవసాయశాఖ ద్వారా యాంత్రీకరణ పథకాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకురావడమే కాక, నోడల్ ఏజెన్సీగా అగ్రోస్‌ను గుర్తించడంతో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టును ఓబుళపతితో భర్తీ చేయడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయశాఖను సమన్వయం చేసుకుని రూ.2.87 కోట్ల బడ్జెట్‌తో రైతులకు వివిధ రకాల స్ప్రేయర్లు, రోటా వీటర్లు, పవర్ టిల్లర్లు, పవర్‌వీడర్లు, బ్రష్ కట్టర్స్ తదితర 1,661 యంత్ర పరికరాలు అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
యువకుడి ఆత్మహత్య
డి.హీరేహాళ్ (రాయదుర్గం): డి.హీరేహాళ్ మండలంలోని లింగమనహళ్లి గ్రామానికి చెందిన బసవరాజు (24) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న బసవరాజుకు తల్లి భాగ్యమ్మతో పాటు ఓ సోదరుడు, సోదరి ఉన్నారు. అవసరాల నిమిత్తం రూ.20 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చేందుకు భూమి విక్రయిద్దామనుకుంటే అది కాస్త కోర్టు పరిధిలో ఉంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి జీవితంపై విరక్తితో శుక్రవారం పొలం వద్ద క్రిమి సంహారక మందు తాగాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే బళ్లారిలోని విమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే మృతి చెందాడు. మృతుడి తల్లి కురుబ భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మందుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు