అనంతపురం సెంట్రల్: అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్న చిన్నారులకు పోషణతో కూడిన విద్యనందించాలని కార్యకర్తలను ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ నాగమణి ఆదేశించారు. అనంతపురంలోని చిన్మయానగర్‌లో ఉన్న ప్రాంగణంలో అనంతపురం అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు ‘పోషణ్ బీ– పడాయి బీ’ కార్యక్రమంపై మూడు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పీడీ నాగమణి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు పౌష్టికాహారంతో పాటు విద్య కూడా ముఖ్యమన్నారు. ఇది కూడా సాధారణంగా కాకుండా చిన్నారులకు అర్థమయ్యేలా ఉండాలన్నారు. సెల్‌ఫోన్లకు బానిసలు కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో తల్లిదండ్రులనూ భాగస్వాములను చేయాలన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ లలిత, సూపర్‌వైజర్లు కొండమ్మ, విష్ణువర్దిని, విజయ, హేమలత తదితరులు పాల్గొన్నారు.
సర్వేయర్లకు మెమోల జారీ
శింగనమల: విధులపై నిర్లక్ష్యం కనబరిచిన శింగనమల మండలం సోదనపల్లి సచివాలయ విలేజ్ సర్వేయర్ శివానంద, వెస్ట్ నరసాపురం సచివాలయ విలేజ్ సర్వేయర్ డి.వాణికు అధికారులు మెమోలు జారీ చేశారు. ఈ మేరకు ఎంపీడీఓ భాస్కర్ గురువారం వెల్లడించారు. తనిఖీకి వెళ్లిన సమయంలో వారు విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా గుర్తించామన్నారు. మూడు రోజుల్లోపు వారు వివరణ ఇవ్వకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మట్కా బీటర్ల అరెస్ట్
తాడిపత్రి టౌన్: స్థానిక శాంతి నగర్ ఆర్చ్ వద్ద ఖాళీ ప్రదేశంలో మట్కా రాస్తున్న ముకుందర్ మున్నీర్ బాషా, బద్వేల్‌బాషా మొహిద్దీన్, పల్లెల గోవర్థన్, వెన్నపూస లక్ష్మీనారాయణ, నడిపి వెంకటనారాయణను అరెస్ట్ చేసినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. అందిన సమాచారంతో ఎస్‌ఐ గౌస్‌బాషా, సిబ్బంది అక్కడకు చేరుకుంటుండగా గమనించిన మరో బీటర్ ముకుందర్ ఖాజా అలియాస్ లప్ప ఖాజా పరారయ్యాడన్నారు. మిగిలిన ఐదుగురిని అరెస్ట్ చేసి రూ.1.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పోషణతో కూడిన విద్యనందించాలి