అనంతపురం: ఏపీఎల్ క్రికెట్ తరహాలోనే ఫుట్‌బాల్‌లో ఏపీ సూపర్ కప్ టోర్నీని నిర్వహిస్తున్నట్లు ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ తెలిపారు. ఈ నెల 27వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీ గురువారం అనంతపురంలోని ఆర్డీటీ క్రీడాగ్రామంలో అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలను 8 జోన్లుగా విభజించి 8 క్లబ్బులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో వంశధార ఫుట్‌బాల్ క్లబ్ (శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలు), విశాఖపట్నం ఫుట్‌బాల్ క్లబ్ (విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు జిల్లాలు), గోదావరి ఫుట్‌బాల్ క్లబ్ ( తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలు), కొల్లేరు ఫుట్‌బాల్ క్లబ్ (ఏలూరు, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు), నల్లమల ఫుట్‌బాల్ క్లబ్ (గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాలు), కోరమాండల్ పుట్‌బాల్ క్లబ్ (నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలు), పెన్నా ఫుట్‌బాల్ క్లబ్ (కడప, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలు), తుంగభద్ర క్రికెట్ క్లబ్ (అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలు) ఉన్నాయన్నారు. ఒక్కో క్లబ్ నుంచి స్థానిక 11 మంది ఫుట్‌బాల్ క్రీడాకారులు, మరో 11 మంది ఇతర రాష్ట్రాల క్రీడాకారులకు ప్రాతినిథ్యం కల్పించినట్లు వివరించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీని విజయవంతం చేయాలని కోరారు.
● తొలి రోజు జరిగిన ఉత్కంఠ పోరులో పెన్నా, కోరమండల్, కొల్లేరు, వంశధార జట్టు గెలుపొందాయి. తొలి మ్యాచ్‌లో తుంగభద్ర ఫుట్‌బాల్ క్లబ్‌తో తలపడిన పెన్నా ఫుట్‌బాల్ క్లబ్ జట్టు 2–4 గోల్స్ తేడాతో విజయాన్ని కై వసం చేసుకుంది. రెండో మ్యాచ్‌లో నల్లమల క్లబ్‌తో తలపడిన కోరమాండల్ క్లబ్ జట్టు ఆటలో ఆధిపత్యం కొనసాగిస్తూ 2–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో గోదావరి క్లబ్ జట్టుపై కొల్లేరు క్లబ్ జట్టు మూడు గోల్స్ సాధించి ఘన విజయం సాధించింది. అలాగే విశాఖ జట్టుపై తలపడిన వంశధార క్లబ్ జట్టు వరుసగా మూడు గోల్స్ సాధించి విజయకేతనం ఎగురవేసింది.