శింగనమల: దళితురాలైన ఓ మహిళా ఉద్యోగిపై టీడీపీ నేత తన దూకుడు ప్రదర్శించాడు. చెప్పుతో కొట్టమంటూ భార్యను రెచ్చగొట్టి వివాదానికి తెర దీశాడు. ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వివరాలు... శింగనమల వెలుగు కార్యాలయంలో దళితురాలైన సరస్వతి సీసీగా పనిచేస్తోంది. శింగనమలలోని చితంబరస్వామి మహిళా సంఘం సభ్యురాలు వెంకటలక్ష్మి తన గ్రూపులోని సభ్యురాలు భారతి పేరుపై ఇప్పటికే రూ.50 వేలు తీసుకున్నారు. ఈ క్రమంలో పొదుపులో నుంచి మరో రూ.10 వేలు తీసుకునేందుకు వెంకటలక్ష్మి సిద్ధమైంది. దీంతో గురువారం సీసీని కలసి సంప్రదించింది. ఇప్పటికే మహిళా సంఘాల్లో అక్రమాలు బయటపడుతున్నాయని, ఒకరి పేరు మీద మరొకరు రుణం తీసుకోవడం సరికాదని సీసీ తెలిపింది. తీసుకునే రుణమేదో వ్యక్తిగత పేరుపైనే తీసుకోవాలని సూచించింది. దీంతో తన ఖాతా హోల్డ్‌లో ఉండడంతో బంధువైన భారతి పేరుపై తీసుకుంటున్నట్లు వెంకటలక్ష్మి సర్దిచెప్పింది. దీంతో భారతి పేరుపై పొదుపు రుణాన్ని తాను తీసుకుంటున్నట్లు తీర్మానంలో రాసుకుని వస్తే పని పూర్తి చేస్తానని సీసీ తెలపడంతో వెంకటలక్ష్మి ఇంటికి వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత తన భర్త ఆదినారాయణ (రాష్ట్ర నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్)ను వెంటబెట్టుకుని కార్యాలయానికి వచ్చిన వెంకటలక్ష్మి... తీర్మానం కాపీపై సీసీతో సంతకం చేయించుకుని తిరుగు ప్రయాణమైంది. అయితే అప్పటికే కార్యాలయం బయట వేచి ఉన్న ఆదినారాయణ... సీసీని బయటకు రమ్మంటూ కేకలు వేయడంతో ఆయనకు సర్దిచెప్పి పిలుచుకెళ్లే ప్రయత్నం చేసింది. అయినా ఆయన గట్టిగా దుర్భాషలాడుతూ కేకలు వేస్తుండడంతో సీసీ సరస్వతి కార్యాలయం బయటకు వచ్చింది. ఆమెను చూడగానే తన భార్యను చూస్తూ ‘చెప్పు తీసుకుని దాన్ని కొట్టు’ అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అక్కడున్న వారు వారించబోతే ‘చెప్పుతో కొడతా.. మెట్టుతో కొడతా.. నన్నేవరూ ఏమీ చేసుకోలేరు’ అంటూ .. మరింత రెచ్చిపోయాడు. ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
చెప్పుతో కొట్టమంటూ భార్యను రెచ్చగొట్టిన వైనం