అనంతపురం ఎడ్యుకేషన్: ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (పీఎస్‌హెచ్‌ఎం) ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పీఎస్‌హెచ్‌ఎం అసోసియేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబును బుధవారం కలసి వినతిపత్రం అందజేశారు. పంచాయతీ ఆదర్శ పాఠశాలల్లో పీఎస్‌హెచ్‌ఎం పోస్టును కేటాయించాలని కోరారు. 117 జీఓ అమలుతో ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు విలీనమై, తప్పని పరిస్థితుల్లో ఇతర పాఠశాలలకు బదిలీ అయిన పీఎస్‌హెచ్‌ఎంలకు ఈ ఏడాది జరిగే బదిలీల్లో పాత స్టేషన్ నుంచి గరిష్టంగా 8 ఏళ్ల సర్వీస్ పాయింట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పీఎస్‌హెచ్‌ఎం ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. డీఈఓను కలిసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షులు గోసల నారాయణస్వామి, ప్రధాన కార్యదర్శి రమణ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు పి. వెంకటరమణ, మర్రిస్వామి, ఆర్థిక కార్యదర్శి ఎ.ఈశ్వరయ్య, కార్యవర్గ సభ్యులు కమతం ఈశ్వరయ్య, మురళీ ప్రసాద్, జనార్ధన రెడ్డి, రాజేంద్ర, గంగరాజు ఉన్నారు.