అనంతపురం అర్బన్: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గత ప్రభుత్వం చేపట్టిన రీ–సర్వే ప్రక్రియను ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న విషయం విదితమే. జిల్లావ్యాప్తంగా తొలి దశలో పైలెట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామం చొప్పున 31 మండలాల పరిధిలో 31 గ్రామాల్లో రీ–సర్వే చేపట్టారు. ఇదే క్రమంలో రెండో దశ కింద 62 గ్రామాల్లో రీ–సర్వేకు చర్యలు ప్రారంభించినట్లు సర్వే, భూ రికార్డుల శాఖ ఏడీ రూప్లానాయక్ తెలిపారు. మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 32 మండలాల్లో ఉన్న 503 గ్రామాలకు సంబంధించి 25,17,658.52 ఎకరాల రీ సర్వేకు గత ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. గ్రామాల్లో డ్రోన్లతో ఓఆర్‌ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్) చిత్రాలను తీశారు. 499 గ్రామాలకు సంబంఽధించి ఓఆర్‌ఐలు సిద్ధంగా ఉన్నాయి. అదే క్రమంలో 198 గ్రామాల్లోని 5,88,615.626 ఎకరాలు సర్వే పూర్తి చేశారు. మిగిలిన 305 గ్రామాల్లో రీ–సర్వే చేయనున్నారు.
అంతా పక్కాగా : గత ప్రభుత్వంలో భూముల రీ–సర్వే ప్రక్రియ పక్కాగా జరిగింది. 503 గ్రామాలకు గాను 198 గ్రామాల పరిధిలోని 1,83,353 భూ కమతాలకు సంబంధించి 5,88,615.626 ఎకరాలు సర్వే చేసి హద్దురాళ్లు ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో అధికారులు సభలను నిర్వహించగా, 1,83,353 భూ కమతాలకు గానూ 5,421 ఫిర్యాదులు (0.03 శాతం) మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే సర్వే పక్కాగా జరిగిందని అర్థమవుతోంది.
గ్రామసభలు..: గత ప్రభుత్వం సర్వం సిద్ధం చేయడంతో పాటు 198 గ్రామాల్లో సర్వే కూడా పూర్తి చేసింది. దీంతో ప్రస్తుతం రీ–సర్వే సజావుగా జరగనుంది. ఆయా గ్రామాల్లో సభలు నిర్వహిస్తున్నారు.
సర్వే, భూ రికార్డుల శాఖ ఏడీ రూప్లానాయక్