● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
అనంతపురం అర్బన్: ‘‘రెన్యూవబుల్ ఎనర్జీ పేరుతో వేల ఎకరాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాల్లో రైతుకు భద్రత లేకపోగా నష్టం చేకూర్చేలా, వినియోగాదారునిపై భారం మోపేలా ఉన్నాయి. కాబట్టి ఈ ఒప్పందాలను పునఃసమీక్షించాలి’’ అని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ ఒప్పందాలకు వ్యతిరేకంగా ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తలపెట్టామన్నారు. మంగళవారం అనంతపురం విచ్చేసిన ఆయన స్థానిక గణేనాయక్ భవన్‌లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్పతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రెన్యూవబుల్ ఎనర్జీ ఒప్పందాల్లో భాగంగా రైతుల నుంచి సంస్థలు తీసుకున్న భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణం తీసుకుని ఎగ్గొడితే.. ఆ నష్టాన్ని రైతులు భరించాల్సి వస్తోందన్నారు. కౌలు కార్డు ఇచ్చే క్రమంలో 11 నెలలకు మాత్రమే గడువు ఇస్తూ యజమానికి భద్రతనిచ్చే ప్రభుత్వం.. కంపెనీల విషయంలో ఇందుకు విరుద్ధంగా ఏకంగా 25 ఏళ్ల లీజుకు ఇచ్చేందుకు అంగీకరించడం ఏమిటని ప్రశ్నించారు. ఎకరా భూమిపై నెలకు రూ.5 లక్షలకు మించి సంపాదించుకునే కంపెనీలు రైతులకు మాత్రం ఏడాదికి రూ.30 వేలు లీజు చెల్తిస్తామనడం సరైంది కాదన్నారు. రైతులకు ఎకరాకు నెలకు రూ.30 వేలు లీజు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాలుగైదేళ్లలో కంపెనీలకు వాటి పెట్టుబడులు తిరిగొస్తాయన్నారు. అధిక ధరలకు ఒప్పందాలు చేసుకుని అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్న అదానీ ఒప్పందంపై మంత్రి కేశవ్ స్పందించాలన్నారు. ప్రతిపక్షంలో ఉండగా కోర్టులో కేసు వేసిన ఆయన ఇప్పుడు మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు.
ఎకై ్సజ్ శాఖలో పదోన్నతులు
కర్నూలు: ఎకై ్సజ్ శాఖలో పదోన్నతులకు రంగం సిద్ధమైంది. ఫోర్త్‌జోన్ పరిధిలో మొత్తం 52 పోస్టులు ఖాళీగా ఉండగా 48 మంది హెడ్ కానిస్టేబుళ్లు, క్లర్కులకు అడ్‌హాక్ పద్ధతిలో ఎస్‌ఐలుగా పదోన్నతి కల్పించి పోస్టింగులు కేటాయించాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ నుంచి ఇటీవల జిల్లా కేంద్రానికి ఉత్తర్వులు అందాయి. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రూప్–2 పోస్టులే అయినా అడ్‌హాక్ పద్ధతిలో పదోన్నతికి రంగం సిద్ధం చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే సర్వీస్ రిజిస్టర్ల పరిశీలన పూర్తి కావడంతో ఈ నెల 20, 21 తేదీల్లో క్లర్కులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు తూనికలు, కొలతల శాఖ అధికారులకు డిప్యూటీ కమిషనర్ లేఖ రాశారు. సీమ జిల్లాల్లో 12 మంది క్లర్కులకు వైద్యపరీక్షల అనంతరం ఎస్‌ఐలుగా పదోన్నతి కల్పించనున్నారు.