బెళుగుప్ప: మండలంలోని దుద్దేకుంట గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బెళుగుప్పలోని పరీక్ష కేంద్రానికి గ్రామం నుంచి ఆటోలో బయలుదేరిన విద్యార్థులు... అంకంపల్లి వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన ఆర్‌టీసీ బస్సును డ్రైవర్ తప్పించబోవడంతో ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పల్లంలోకి దూసుకెళ్లింది. ఘటనలో స్వల్ప గాయాలతో విద్యార్థులు బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టి విద్యార్థులకు ధైర్యం చెప్పారు. ఆటోను తిరిగి రోడ్డుపైకి చేర్చి విద్యార్థులను సకాలంలో పరీక్ష కేంద్రానికి చేర్చారు. కాగా, విషయం తెలుసుకున్న డీఎస్పీ అష్రఫ్ అలీ, ఎస్‌ఐ శివ పరీక్షా కేంద్రం వద్దకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు. అనంతరం ఆటో డ్రైవర్లతో సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్య పరిచారు. కాగా, బస్సులను ఏర్పాటు చేయడంలో ఆర్‌టీసీ అధికారులు విఫలం కావడంతోనే పిల్లలను ఆటోల ద్వారా పరీక్ష కేంద్రాలకు పంపాల్సి వస్తోందని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ‘అనంత’ ప్రతిభ
గుంతకల్లు: వైఎస్సార్ జిల్లా పులివెందుల వేదికగా జరిగిన 34వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీల్లో అనంతపురం జిల్లా బాలికల జట్టు రన్నరప్‌ను దక్కించుకుంది. ఈ మేరకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి లక్ష్మణ్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ బాలికల కబడ్డీ పోటీలు జరిగాయి. ఫైనల్‌లో శ్రీకాకుళం జట్టుతో తలపడిన అనంత జట్టు ఒక్క పాయింట్ తేడాతో విజయాన్ని చేజార్చుకుంది. కాగా, రన్నర్స్ ట్రోఫీని దక్కించుకున్న జిల్లా జట్టును కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.
పదో తరగతి విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం