● తొలిరోజు 638 మంది
విద్యార్థుల గైర్హాజరు
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభ మయ్యాయి. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు 31,169 మంది విద్యార్థులకు గాను 30,531 మంది హాజరయ్యారు. 638 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 30 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. డీఈఓ ప్రసాద్‌బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్, డీవైఈఓ శ్రీనివాసరావు వివిధ కేంద్రాలను పరిశీలించారు.
వసతుల్లేక ఇబ్బందులు..
అనంతపురం నగరంలోని నంబర్–1 ఉన్నత పాఠశాల కేంద్రంలో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా గదులు కనీసం శుభ్రం చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. జిల్లాలో పరీక్షల నిర్వహణపై ఆర్జేడీ శామ్యూల్ ప్రత్యేక దృష్టి సారించడంతో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లలో గుబులు పట్టుకుంది. దీనికితోడు సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏ కేంద్రాలకు వెళ్లాలనేది ఆర్జేడీ పర్యవేక్షణలో జరుగుతోంది. ఈ విషయంలో అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిర్వహణలో పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. చిన్న తప్పు జరిగినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే చర్చ విధుల్లో ఉన్న టీచర్ల నుంచి వ్యక్తమవుతోంది.
పటిష్ట బందోబస్తు..
అనంతపురం: పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కళ్యాణదుర్గం తదితర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాల పరిసరాల్లో డ్రోన్లతో పర్యవేక్షించారు. 144 సెక్షన్ పక్కాగా అమలు చేశారు. ప్రత్యేక పోలీసు బృందాలు పెట్రోలింగ్ చేపట్టాయి. పరీక్షలు ముగిసేంత వరకు జిరాక్స్, ప్రింటింగ్ సెంటర్లు మూసివేయించారు. విద్యార్థులు, పరీక్షల నిర్వహణ అధికారులు, ఆయా పాఠశాల సిబ్బంది మినహా ఎవరినీ పరిసర ప్రాంతాల్లోకి రానీయలేదు. విద్యార్థులు సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, పర్సులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్రాల్లోకి తీసుకెళ్ల కుండా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
చిన్న పొరపాటుకూ తావివ్వొద్దు
గార్లదిన్నె: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో చిన్న పొరపాటుకూ తావివ్వొద్దని విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్ పేర్కొన్నారు. పరీక్షల అధికారులతో సోమవారం గార్లదిన్నె పోలీస్ స్టేషన్ నుంచి సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ నుంచి పరీక్ష పేపర్లను సకాలంలో జాగ్రత్తగా కేంద్రాలకు తరలించాలన్నారు. పరీక్ష ముగిసిన తరువాత పక్కాగా భద్రపరచాలన్నారు. పేపర్ లీక్ కాకుండా చూసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.