అనంతపురం: విశ్వసనీయత, సప్రమాణత అనేవి పరీక్షల మూల్యాంకనం యొక్క కనీస ధర్మం. మార్కుల నమోదు ప్రక్రియ అనేది అత్యంత రహస్యంగా, పకడ్బందీగా నిర్వర్తించాల్సి ఉంటుంది. తద్వారా అందే సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుంది. అయితే జేన్‌టీయూ(ఏ) పరీక్షల విభాగం ఉన్నతాధికారులు కనీస నిబంధనలు పాటించకుండా మార్కుల నమోదును నేరుగా ఆయా కళాశాలలకు అప్పగించి వృత్తి ధర్మాన్ని విస్మరించారు. మీకు ఇష్టం వచ్చిన మార్కులు మీరే నమోదు చేసుకోండి అంటూ స్వేచ్ఛను ఇచ్చేశారు. వర్సిటీ పరీక్షల విభాగం అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
‘స్వయం ’కోర్సులు తప్పనిసరి..
సాంకేతిక కోర్సులను అభ్యసించే విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు వీలుగా స్వయం పేరుతో ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన కోర్సును పూర్తి చేసిన అనంతరం విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహిస్తారు. బీటెక్ మూడు, నాల్గో సంవత్సరం విద్యార్థులకు రెండో సెమిస్టర్‌లో 100 మార్కులకు చొప్పున ఈ స్వయం కోర్సులను తప్పనిసరి చేశారు. పరీక్షల అనంతరం ఆన్‌లైన్ విధానంలోనే ఐఐటీ, ఎన్‌ఐటీ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించి మార్కులు కేటాయిస్తారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా... ఈ తర్వాతి ప్రక్రియను జేఎన్‌టీయూ(ఏ) పరీక్షల విభాగం అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఆన్‌లైన్ కోర్సులకు సంబంధించిన మార్కులను తప్పనిసరిగా వర్సిటీ పరీక్షల విభాగం సిబ్బంది నమోదు చేయాల్సి ఉంది. గత ప్రభుత్వంలోనూ ఇదే తరహాలోనే మార్కులు నమోదు చేశారు. తాజాగా నిబంధనలకు విరుద్ధంగా నేరుగా ఆయా కళాశాలలకే ఈ బాధ్యత అప్పగించారు. దీంతో వారికి ఇష్టం వచ్చిన రీతిలో మార్కులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. స్వయం కోర్సుల్లో మార్కులు నమోదు చేసే అధికారం ఆయా ఇంజినీరింగ్ కళాశాలలకు అధికారం లేదు. లేని అధికారాన్ని కట్టబెట్టారు. ఇంటర్నల్ మార్కుల తరహాలోనే స్వయం కోర్సుల మార్కులు నమోదు చేయాలని పరీక్షల విభాగం ఉన్నతాధికారులు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేశారు. దీంతో తమ కళాశాల విద్యార్థులకు ఎన్ని మార్కులు కావాలంటే అన్ని మార్కులు వేసేస్తూ ఇంజినీరింగ్ కళాశాలల సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. స్వయం కోర్సులు స్వీయ నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ప్రవేశపెట్టారు. విద్యా ప్రణాళికలో పేర్కొన్న అంశాలే కాకుండా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు కోర్సులు స్వయంగా నేర్చుకునేందుకు స్వయం కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. వీటికి మార్కులు సైతం కేటాయించారు. క్రెడిట్లు లెక్కిస్తారు. ఇలాంటి కీలకమైన అంశాలను తేలికగా తీసుకోవడమే కాకుండా మార్కుల నమోదును ఏకంగా కళాశాలలకు అప్పగించడం వివాదస్పదమవుతోంది.
నియంత్రణ లేని తీరు..
పరీక్షల విభాగంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గైర్హాజరైనా ఫలితాలను విడుదల చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఫలితాలు విడుదల చేసే ముందు అన్ని పరిశీలించి, సర్క్యులర్‌పై కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంతకం చేసిన తర్వాతనే ఫలితాలు ప్రకటిస్తారు. కానీ ఈ నెల 5న ఎంటెక్, సప్లిమెంటరీ ఫలితాలను కంట్రోలర్ లేకుండానే ప్రకటించారు. ఫలితాల విడుదల సర్క్యులర్‌పై కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంతకం లేకపోవడమే ఇందుకు నిదర్శనం. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సిస్టమ్ పాస్‌వర్డ్ అత్యంత కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి పాస్‌వర్డ్ అప్పగించి ఫలితాలు ప్రకటించడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కేవలం ఎక్సెల్ షీట్‌లోనే ఫలితాలు ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో పాస్‌వర్డ్‌తో ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి మార్కులు తారుమారు చేస్తే ఎవరు జవాబుదారీ వ్యవహరిస్తారనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి.
బీటెక్‌లో స్వయం ఆన్‌లైన్ కోర్సులు
తప్పనిసరి
మూడు, నాలుగో సంవత్సరం
విద్యార్థులకు రెండో సెమిస్టర్‌లో
100 మార్కులకు చొప్పున పరీక్షలు
కోర్సు పూర్తయ్యాక ఆన్‌లైన్ ద్వారా ఐఐటీ ప్రొఫెసర్లతో మూల్యాంకనం, మార్కుల కేటాయింపు
ఈ మార్కుల నమోదుకు నేరుగా ఆయా ఇంజినీరింగ్ కళాశాల సిబ్బందికి స్వేచ్ఛ
జేఎన్‌టీయూ (ఏ) పరీక్షల విభాగం
ఉన్నతాధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు
పరిశీలిస్తాం
స్వయం కోర్సులకు సంబంధించి మార్కులను ఆయా కళాశాలలే నమోదు చేసినా, ఆ తర్వాత ర్యాండమ్‌గా వాటిని మేమూ పరిశీలిస్తాం. సీఈ గైర్హాజరైనా ఫలితాలను విడుదల చేశారనడం అవాస్తవం. సర్కులర్‌పై ఆయన సంతకం లేనంత మాత్రాన ఆయన గైర్హాజరైనట్లు కాదు. – ప్రొఫెసర్ నాగప్రసాద్‌నాయుడు,
డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్, జేఎన్‌టీయూ (ఏ)