గుంతకల్లుటౌన్: ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దామని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. ‘స్వచ్ఛాంధ్ర.. స్వచ్ఛ దివస్’ కార్యక్రమంపై శనివారం గుంతకల్లు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణానికి ప్రమాదమని తెలిసినా ప్లాస్టిక్ వినియోగం మాత్రం తగ్గడం లేదన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని, మన ప్రవర్తనలో కూడా స్వచ్ఛత ఉండాలన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌కు స్వస్తి చెప్పాలని కోరారు. స్వచ్ఛభారత్ నిర్మాణానికి, ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కాగా ప్లాస్టిక్ భూతాల వేషధారణలతో పారిశుధ్య కార్మికులు అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్.భవానీ, ఆర్‌డీఓ శ్రీనివాస్, కమిషనర్ నయీమ్ అహ్మద్, డీఎల్‌డీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకే గుండాల తండా ఆదర్శం కావాలి..
గుంతకల్లు రూరల్: గుంతకల్లు మండలంలోని గుండాల తండా గ్రామం జిల్లాలోని అన్ని గ్రామాలకు ఆదర్శం కావాలని, ఆ విధంగా గ్రామాన్ని తీర్చిదిద్దే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. గుండాల తండాలో నిర్వహించిన ‘స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి కలెక్టర్ వినోద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో వివిధ రకాల కార్యక్రమాలను ప్రారంభించారు. మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకున్నట్లుగా గ్రామాన్ని కూడా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విలువలతో కూడిన విద్యనభ్యసించాలి
గుంతకల్లుటౌన్: ‘విలువలతో కూడిన విద్యకు మార్కులతో కొలమానం లేదు. విద్యార్థులు ఒక లక్ష్యంతో ముందుకు సాగుతూ విలువలతో కూడిన విద్యనభ్యసించాలి’ అని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ హేమచంద్రారెడ్డి అన్నారు. స్థానిక శ్రీవివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ విద్యాసంస్థ ఆధ్వర్యంలో పాఠశాల 24 వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ, నైపుణ్యాలను పాఠశాల నుంచే అలవర్చుకున్నప్పుడే విద్యార్థులు గొప్పగా తయారవుతారని చెప్పారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పోటీ ప్రపంచంలో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు మస్తాన్‌రావు, సుబ్బరాయుడు, విద్యాసంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ మంజునాథ్, కరస్పాండెంట్ ఓంకారప్ప, తదితరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం