ఉరవకొండ: జిల్లాలోని వివిధ డిపోల పరిధిలో నిత్యం రద్దీగా ఉండే రూట్లకు అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం సుమంత్.ఆర్.ఆదోని తెలిపారు. బుధవారం ఉరవకొండ ఆర్టీసీ డిపోను ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు. జిల్లాకు 48 కొత్త బస్సుల కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పాత బస్సుల స్ధానంలో 98 కొత్త బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీలో ప్రస్తుతం నష్టాలు తగ్గాయని, త్వరలోనే లాభాల బాటలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. రెండేళ్లలో కారుణ్య నియమాకాల కింద రెండు దఫాలుగా 131 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. త్వరలో మరో 38 మందిని కండెక్టర్లుగా అవకాశం కల్పిస్తామన్నారు. ఉరవకొండ డిపో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉరవకొండ డీఎం హంపన్న, ఎస్‌టీ రమణమ్మ పాల్గొన్నారు.
‘ఉపాధి’ బకాయిలు
వెంటనే చెల్లించాలి
కళ్యాణదుర్గం రూరల్: ఉపాధి కూలీలకు వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ సభ్యుడు అచ్యుత్ కలసి కళ్యాణదుర్గం మండలం యరరంపల్లి, గరుడాపురం, శెట్టూరు మండలం యాటకల్లు గ్రామాల్లో బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి కూలీలతో మాట్లాడారు. సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీలకు 6 నుంచి 8 వారాల పాటు బిల్లులు మంజూరు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పదేళ్ల క్రితం మంజూరు చేసిన పనిముట్లతోనే కాలం నెట్టుకొస్తున్నారన్నారు. తక్షణమే కొత్త పనిముట్లు అందజేయాలని, పని ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలని, వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
‘పీఎంఏవై’లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అదనపు లబ్ధి
అనంతపురం అర్బన్: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద బీసీ, ఎస్సీ, ఎస్టీల గృహ నిర్మాణాలకు అదనపు ఆర్థిక లబ్ధిని ప్రభుత్వం చేకూరుస్తోందని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో డీఆర్‌ఓ ఎ.మలోల, హౌసింగ్ పీడీ శైలజతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పీఎంఏవై 1.0 కింద జిల్లాకు 82,159 ఇళ్లు మంజూరు కాగా, ఇందులో 35,351 ఇళ్లు పూర్తయ్యాయని, 28,560 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇంటి నిర్మాణానికి యూనిట్ ధర రూ.1.80 లక్షలుగా నిర్దేశించినట్లు తెలిపారు. దీనికి అదనంగా బీసీ, ఎస్సీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.70 వేలు ఆర్థిక లబ్ధి ఉంటుందన్నారు. ఇందులో నిబంధనలు వర్తిస్తాయన్నారు. తద్వారా జిల్లాలో 15,882 మంది బీసీలు, 4,232 మంది ఎస్సీలు, 904 మంది ఎస్టీలకు అదనపు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ నెల 15 నుంచి 23వ తేదీవరకు లబ్ధిదారుల ఇళ్లకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వెళ్లి అదనపు లబ్ధి గురించి వివరించి, వారి ఇంటిని ఫొటో తీసుకుంటారన్నారు.
అదనపు బస్సు సర్వీసుల ఏర్పాటు