అర్జీలిస్తూనే ఉన్నా స్పందన లేదు | - | Sakshi
Sakshi News home page

అర్జీలిస్తూనే ఉన్నా స్పందన లేదు

Mar 11 2025 12:28 AM | Updated on Mar 11 2025 12:25 AM

సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలి

అనంతపురం అర్బన్‌: సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్‌ వినోద్‌కుమార్‌తో పాటు డీఆర్‌ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్‌, తిప్పేనాయక్‌, రామ్మోహన్‌, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 419 వినతులు అందాయి.

వినతుల్లో కొన్ని...

● ‘పీఎం’ కిసాన్‌ డబ్బు అందడం లేదని ఆత్మకూరు మండలం తలపూరుకు చెందిన పి.ఎర్రి స్వామి విన్నవించాడు. 2.30 ఎకరాల్లో చీనీ పంట ఉందని, ‘పీఎం కిసాన్‌’ కింద డబ్బులు అందించాలని కోరాడు.

● వితంతు పింఛను ఇప్పించాలంటూ శింగనమల మండలం గోవిందరాయునిపేట గ్రామానికి చెందిన మంజుల అంజనమ్మ విన్నవించింది. తన భర్త వెంకటేష్‌ గత ఏడాది జనవరి 8న మరణించాడని, అప్పట్లో ఆయనకు వృద్ధాప్య పింఛను వచ్చేదని చెప్పింది.

● తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం ఇప్పించాలని పుట్లూరు మండలం ఎస్‌.తిమ్మాపురం గ్రామానికి చెందిన జి.రవినాథ్‌రెడ్డి విన్నవించాడు. త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు.

పరిహారం తక్కువిచ్చారు

సజ్జలదిన్నె పొలం సర్వే నంబరు 338–1–64, 339–2–74లో మాకు 6 ఎకరాలు ఉంది. జాతీయ రహదారి 544– డీ నిర్మాణం కోసం అందులో 23 సెంట్లు తీసుకున్నారు. ఆరు ఎకరాల్లో వేసిన కంది పంటనూ తొలగించారు. రూ.5.75 లక్షల పరిహారం రావాల్సి ఉంటే ఒక్క రూపాయి ఇవ్వలేదు. తహసీల్దారు కార్యాలయం, కలెక్టరేట్‌లో చాలా సార్లు అర్జీ ఇచ్చాను. సమస్య పరిష్కారం కాలేదు.

– ఇంజా లక్ష్మిరెడ్డి, వెంకటరెడ్డిపల్లి, తాడిపత్రి మండలం

జాతీయ రహదారి 544–డీలో భాగంగా మాకున్న 4 సెంట్ల స్థలంతో పాటు ఇంటిని కోల్పోయాం. 15 ఏళ్ల వేపచెట్లు మూడు తొలగించారు. కేవలం రూ.2.30 లక్షల పరిహారం ఇచ్చారు. మా ఊరిలో చాలా మందికి రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం అందింది. అందరితో సమానంగా పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా సమస్య పరిష్కారం కాలేదు.

– సుంకులమ్మ, సీపురం,

శింగనమల మండలం

అనంతపురం అర్బన్‌: చిన్నపాటి సమస్యలు జిల్లా కేంద్ర కార్యాలయాలకు రాకుండా క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘‘తిప్పుకుని... తప్పుకుంటున్నారు’’ కథనానికి కలెక్టర్‌ స్పందించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ వారం నుంచి తహసీల్దారు కార్యాలయాల తనిఖీ చేపడతామన్నారు. జాయింట్‌ కలెక్టర్‌, ఆర్‌డీఓలు వారానికి ఒక తహసీల్దారు కార్యాలయాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ఇన్‌స్పెక్షన్‌ ప్రొఫార్మా సంబంధిత కార్యాలయాలకు పంపిస్తామన్నారు. తనిఖీకి వచ్చినప్పుడు ‘వన్‌ సర్వే నంబర్‌– వన్‌ఫైల్‌’ విధానం అమలును పరిశీలిస్తామన్నారు. చుక్కల భూమికి సంబంధించి ప్రజాసేవ పోర్టల్‌లో పెండింగ్‌ ఉన్నవాటిని పరిష్కరించాలన్నారు. మండలస్థాయిలో ప్రజాసేవలు వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఉద్యోగులకు సన్మానం

పెన్షన్‌ పంపిణీ ఒకటో తేదీ మొదటి గంటలో 100 శాతం పూర్తి చేసిన వారిని కలెక్టర్‌ సన్మానించారు. ‘బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌’ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దాతల భాగస్వామ్యం (పీ4) పోస్టర్లను ఆవిష్కరించారు.

లక్ష్యాలను పూర్తి చేయాలి

ఉపాధి హామీ పథకం, ఇతర కార్యక్రమాల కింద కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి డ్వామా పీడీ, డీఎల్‌డీఓలు, ఎంపీడీఓలు, మునిసిపల్‌ కమిషనర్లు, ఏపీడీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

బాధితుల ఆవేదన

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు 419 వినతులు

అర్జీలిస్తూనే ఉన్నా స్పందన లేదు 1
1/3

అర్జీలిస్తూనే ఉన్నా స్పందన లేదు

అర్జీలిస్తూనే ఉన్నా స్పందన లేదు 2
2/3

అర్జీలిస్తూనే ఉన్నా స్పందన లేదు

అర్జీలిస్తూనే ఉన్నా స్పందన లేదు 3
3/3

అర్జీలిస్తూనే ఉన్నా స్పందన లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement