ఉరవకొండ: గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి బ్రహ్మ రథోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరగనుంది. ఇప్పటికే గవిమఠం సహాయ కమిషనర్ కె.రాణి ఆధ్వర్యంలో సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు తాగునీరు, నిత్యాన్నదాన సేవ, తాత్కాలిక మరుగు దొడ్లతో పాటు గవిమఠం ఆవరణలో పోలీసు కంట్రోల్ రూం, ఉరవకొండ సీహెచ్‌సీ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రథోత్సవంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా స్పెషల్ పార్టీ బలగాలు బందోబస్తు చేపట్టనున్నాయి. ఉత్సవాన్ని తిలకించడానికి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా కర్ణాటక నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి చంద్రమౌళీశ్వర స్వామి బసవేశ్వర వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.