లైనింగ్‌కు టెండర్లు సరికాదు | - | Sakshi
Sakshi News home page

లైనింగ్‌కు టెండర్లు సరికాదు

Mar 8 2025 2:06 AM | Updated on Mar 8 2025 2:06 AM

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్‌

అనంతపురం అర్బన్‌: ‘‘హంద్రీ–నీవా కాలువను 10 వేల క్యూసెక్కుల సామార్థ్యంతో వెడల్పు చేయాలి. పంట కాల్వలు తవ్వి ఆయకట్టుకు నీరు ఇవ్వాలి’ అని రైతులు కోరుతుంటూ లైనింగ్‌ పనులకు ప్రభుత్వం టెండర్లు పిలవడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్‌ అన్నారు. శుక్రవారం స్థానిక గణేనాయక్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమ అభివృద్ధికి సాగునీటి వనరుల అభివృద్ధి కీలకమన్నారు. హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేయకుండా అత్యంత వెనబడిన ఉమ్మడి అనంతపురం జిల్లాను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. కృష్ణాజలాల కోసం చేసిన పోరాటాల ఫలితమే హంద్రీ–నీవా ద్వారా 2012 నుంచి జీడిపల్లికి కృష్ణాజలాలు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం వస్తున్న 40 టీఎంసీలు కాకుండా అదనంగా నీరు ఇస్తామని ఎన్నికల ముందు ప్రధాన రాజకీయ పార్టీలు హామీలు ఇస్తూనే ఉన్నాయన్నారు. హంద్రీ–నీవా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేసి ఆయకట్టును స్థిరీకరించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లోనే సీఎం చంద్రబాబుతో సానుకూల నిర్ణయం ప్రకటింపజేయాలన్నారు. 6,300 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యానికి కాలువను వెడల్పు చేసేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఖరారు చేసిన టెండర్లలో 3,850 క్యూసెక్కులకే పరిమితం చేయడం, రెండవ దశ కాలువ లైనింగ్‌ పనులకు సిద్ధపడడం చూస్తుంటే సీఎం చంద్రబాబు తీరు ఏరుదాటాక తెప్పతగలేసినట్లుగా ఉందన్నారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

కళ్యాణదుర్గం రూరల్‌: మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వివరాలు... కళ్యాణదుర్గం నుంచి అనంతపురానికి గురువారం అర్ధరాత్రి వెళుతున్న అంబులెన్స్‌ వాహనం గొళ్ల గ్రామం సమీపంలోకి చేరుకోగానే రోడ్డు దాటుతున్న అదే గ్రామానికి చెందిన కుళ్లాయప్ప (60)ను ఢీకొంది. ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే మంగళకుంట గ్రామం వద్ద గురువారం అర్ధరాత్రి రోడ్డు దాటుతున్న అదే గ్రామానికి చెందిన పెద్ద మల్లయ్యను ట్రాక్టర్‌ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని స్థానికులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. చికిత్సకు స్పందించక శుక్రవారం ఆయన మృతి చెందాడు. ఈ రెండు ఘటనలపై కళ్యాణదుర్గం రూరల్‌ పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి

అనంతపురం రూరల్‌: డీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్‌ ఉప సంచాలకులు సుమన జయంతి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. టెట్‌ పరీక్షల్లో అర్హత సాధించిన బీసీ, ఈబీసీ అభ్యర్థులు అర్హులు. ఈ నెల 10 నుంచి దరఖాస్తు చేసుకోవాలి. టెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఉచిత శిక్షణకు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు 08554–275575లో సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement