
పంపనూరులో సాయుధ బలగాల కవాతులో పాల్గొన్న ఎస్పీ అమిత్ బర్దర్
ఆత్మకూరు: ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని ఎస్పీ అమిత్ బర్దర్ సూచించారు. ఏమైనా ఇబ్బందులుంటే వెంటనే పోలీసుల దృష్టికి తేవాలన్నారు. శుక్రవారం పంపనూరులో కేంద్ర సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు. వీధుల్లో పోలీసు బలగాలతో కలియదిరిగారు. అనంతరం ప్రజలకు పలు సూచనలు చేశారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలే తమ లక్ష్యమని తెలిపారు. ప్రశాంత ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గొడవలకు, అల్లర్లకు దూరంగా ఉండాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసులకు సూచించారు. అల్లర్లకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ నరేంద్రరెడ్డి, ఎస్‌ఐ మునీర్ అహమ్మద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పకడ్బందీగా విధులు నిర్వర్తించండి
కళ్యాణదుర్గం: సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగులు పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ సూచించారు. కళ్యాణదుర్గంలోని ఎస్వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం సాయంత్రం ఎన్నికల స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబూషన్ కేంద్రాలను ఎస్పీ అమిత్ బర్దర్, ఆర్డీఓ రాణీసుస్మిత, డీఎస్పీ బి.శ్రీనివాసులులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై సెక్టోరియల్, నోడల్ అధికారులు, పోలీస్, ఎన్నికల అధికారులతో మేనేజ్‌మెంట్ ప్లాన్‌పై చర్చించారు. ఉద్యోగులు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.