ఆ ఎగ్జామినర్లను తప్పించారు | Sakshi
Sakshi News home page

ఆ ఎగ్జామినర్లను తప్పించారు

Published Sat, Apr 13 2024 12:20 AM

- - Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌: సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌) ఇంటర్‌ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్‌) కోసం నియమితులైన ఎగ్జామినర్లను ఆ విధుల నుంచి తప్పించారు. శుక్రవారం అనంతపురంలోని కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ బాలికల కళాశాలలో మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా సబ్జెక్టుల్లో కనీసం మూడేళ్ల అనుభం ఉన్న వారిని మాత్రమే ఎగ్జామినర్లుగా ఏర్పాటు చేయాలనే నిబంధనను పాటించకపోవడాన్ని ‘ఎగ్జామినర్ల నియామకాల్లో నిబంధనలకు పాతర’ శీర్షికతో ఈ నెల 12న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌, ఓపెన్‌ స్కూల్‌ డైరెక్టర్‌ నాగేశ్వరరావు, ఆర్జేడీ రాఘవరెడ్డి స్పందించారు. అనంతపురంలో ఏమి జరుగుతోందని కమిషనర్‌ ఆరా తీశారు. ఓపెన్‌ స్కూల్‌ డైరెక్టర్‌, ఆర్జేడీ స్వయంగా డీఈఓ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌కు ఫోన్లు చేశారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసినా... వారికి బోధనానుభవం ఉండాలి కదా? అని ప్రశ్నించారు. పొరపాటున కొందరి పేర్లు జాబితాలో ఉన్నాయని అలాంటి వారిని ఈ నెల 8వ తేదీనే తప్పించామంటూ జిల్లా అధికారులు వివరణ ఇచ్చారు. వాస్తవానికి కామర్స్‌ సబ్జెక్టుకు గార్లదిన్నె, బీకేఎస్‌, శింగనమల మండలాలకు చెందిన హిందీ, ఇంగ్లిష్‌ స్కూల్‌ అసిస్టెంట్లను నియమించారు. వీరికి సంబంధిత సబ్జెక్టులో ఎలాంటి బోధనానుభవం లేదు. వీరిని ఆయా స్కూళ్లలో రిలీవ్‌ కూడా చేశారు. ‘సాక్షి’ ఆరా తీయడంతో అప్రమత్తమైన అధికారులు గురువారం సాయంత్రం ఆయా హెచ్‌ఎంలకు ఫోన్లు చేసి వారిని రిలీవ్‌ చేయొద్దని ఆదేశించారు. అప్పటికే రిలీవ్‌ అయిన వారి నుంచి ఉత్తర్వులు వెనక్కు తీసుకోవాలని చెప్పడంతో ఆయా టీచర్ల నుంచి రిలీవ్‌ లెటర్లు వెనక్కు తీసుకున్నారు. విద్యాశాఖ అధికారులు చెబుతున్నట్లు 8వ తేదీనే వారిని తొలగించి ఉంటే 11న హెచ్‌ఎంలు ఎలా రిలీవ్‌ చేశారనేది అధికారులకే తెలియాలి.

ఎగ్జామినర్ల నియమాకాల్లో నిబంధనల ఉల్లంఘనపై విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఆరా

Advertisement
 
Advertisement