టీడీపీ బైక్‌ ర్యాలీలో అపశ్రుతి | Sakshi
Sakshi News home page

టీడీపీ బైక్‌ ర్యాలీలో అపశ్రుతి

Published Sat, Apr 13 2024 12:20 AM

పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు 
నిర్వహిస్తున్న దృశ్యం  - Sakshi

డివైడర్‌ను ఢీకొని టీడీపీ కార్యకర్త మృతి

మరొకరికి తీవ్ర గాయాలు

మడకశిర: టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం మడకశిరలో నిర్వహించిన బైక్‌ ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. డివైడర్‌ను ఢీకొని ఓ టీడీపీ కార్యకర్త అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధి సునీల్‌కుమార్‌కు మద్దతుగా ఆ పార్టీ నాయకులు శుక్రవారం బైక్‌ ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గ కేంద్రంలో చేపట్టిన ఈ ర్యాలీకి అన్ని మండలాల నుంచి టీడీపీ కార్యకర్తలను రప్పించుకున్నారు. ఈ క్రమంలో అమరాపురం మండలం అలదాపల్లికి చెందిన సతీష్‌ (38), అరుణ్‌ ఒకే ద్విచక్ర వాహనంపై ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ ప్రభుత్వ వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల వద్దకు చేరుకుంటుండగా వేగ నియంత్రణ కోల్పోయి సతీష్‌ నడుపుతున్న బైక్‌ నేరుగా రోడ్డు డివైడర్‌ను ఢీకొంది. ఘటనలో సతీష్‌తో పాటు బైక్‌ పై వెనుక కూర్చొన్న అరుణ్‌ కూడా రోడ్డుపై పడ్డారు. సతీష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అరుణ్‌ను 108 అంబులెన్స్‌ ద్వారా హిందూపురంలోని జిల్లాస్పత్రికి తరలించారు. సతీష్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రులకు సతీష్‌ ఒక్కడే కుమారుడు. ప్రమాదం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, భార్యాపిల్లలు ఆస్పత్రి వద్దకు చేరుకుని సతీష్‌ మృతదేహంపై పడి బోరున విలపించారు. ఘటనపై సీఐ మనోహర్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

అనారోగ్యంతో

ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి

పుట్టపర్తి టౌన్‌: అనారోగ్యంతో బాధపడుతున్న జిల్లా పోలీసు కార్యాలయ ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రానాయక్‌ (55) అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. వివరాలు... తలుపుల మండలం గొల్లపల్లి తండాకు చెందిన చంద్రానాయక్‌... 1991లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. అనంతరం ఏఆర్‌ విభాగానికి వచ్చారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. బాధిత కుటుంబసభ్యులకు ఎస్పీ మాధవరెడ్డి సంతాపం తెలిపారు. శాఖాపరంగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. చంద్రానాయక్‌ మృతదేహానికి స్వగ్రామంలో పోలీసు లాంఛనాలతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా పోలీస్‌ అధికారుల సంఘం అడహక్‌ కమిటీ సభ్యులు త్రిలోక్‌, సుధాకర్‌రెడ్డి, సూర్యకుమార్‌, తేజ్‌పాల్‌ పాల్గొన్నారు.

మృతుడు సతీష్‌
1/1

మృతుడు సతీష్‌

Advertisement
 
Advertisement