
సత్సంగ్‌లో పాల్గొన్న సత్యసాయి మొబైల్ వైద్య శాల సిబ్బంది
ప్రశాంతి నిలయం: గ్రామీణ ప్రాంత ప్రజలకు నిస్వార్థ సేవలు అందిస్తున్న సత్యసాయి మొబైల్ ఆస్పత్రి సిబ్బంది సేవలు వెలకట్టలేనివని సత్యసాయి సెంట్రల్‌ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌రాజు కొనియాడారు. మొబైల్ ఆస్పత్రి 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రశాంతి నిలయంలోని సాయి హీరా గ్లోబర్ కన్వెన్షన్ సెంటర్‌లో సిబ్బందితో సత్సంగ్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అథితిగా పాల్గొన్న రత్నాకర్ రాజు మాట్లాడుతూ సత్యసాయి బోధనలను ఆదర్శంగా తీసుకుని లాభాపేక్ష లేకుండా పనిచేయడం గర్వకారణమన్నారు. సత్యసాయి మొబైల్ ఆస్పత్రి సేవలను 2006లో ప్రారంభించారని గుర్తు చేశారు. వందలాది మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, వలంటీర్లు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి స్వచ్ఛందంగా ముందుకు వస్తూ సేవలకు సహకరిస్తున్నారని చెప్పారు. మొబైల్ ఆస్పత్రి సంజీవని బస్సులో ఆధునిక సాంకేతిక వైద్య పరికరాల ద్వారా రోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. రోగి ఆరోగ్య స్థితి బాగుపడే వరకూ సూచనలు సలహాలు అందిస్తూ వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. భవిష్యత్తులో సత్యసాయి మొబైల్ వైద్యసేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సత్యసాయి మొబైల్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ నరసింహన్, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రత్నాకర్ రాజు
Comments
Please login to add a commentAdd a comment