
నార్పల మండలం దుర్గం ఎంపీయూపీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఐఎఫ్‌పీ
అనంతపురం ఎడ్యుకేషన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. చదువుతోనే పేదరికాన్ని జయించవచ్చని ప్రధానంగా నమ్మిన ముఖ్యమంత్రి విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునేందుకు అవసరమైన అన్ని వనరులు సమకూర్చేందుకు ఎక్కడా రాజీపడడం లేదు. ఈ క్రమంలో పేద వర్గాల పిల్లలు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రతి తరగతి గదిలో డిజిటల్ విద్యా బోధనకు శ్రీకారం చుట్టారు.
అత్యధికంగా అనంతపుర అర్బన్‌కు..
నేటి పరిస్థితుల్లో పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడాలంటే ఆధునిక బోధన అమలు తప్పనిసరి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న జగన్ ప్రభుత్వం ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6–10 తరగతుల విద్యార్థులకు ఐఎఫ్‌పీల ద్వారా బోధన సాగించాలని నిర్ణయించింది. ‘మనబడి నాడు–నేడు’ కింద ఎంపికై న పాఠశాలల్లో గతేడాదిలో తొలివిడతగా 245 స్కూళ్లకు 1595 ఐఎఫ్‌పీలు సరఫరా చేశారు. తాజాగా రెండోవిడతగా 340 స్కూళ్లకు 1579 ఐఎఫ్‌పీలు సరఫరా చేస్తున్నారు. రెండోవిడతలో అత్యధికంగా అనంతపుర అర్బన్, రూరల్ మండల పరిధిలో 24 స్కూళ్లకు 149 ప్యానెళ్లు, అత్యల్పంగా బుక్కరాయసముద్రం మండలంలో 8 స్కూళ్లకు 22 ప్యానెళ్లు కేటాయించారు. రెండు రోజుల్లో నేరుగా ఆయా స్కూళ్లకు చేరనున్నాయి.
ప్రాథమిక స్థాయిలోనూ ‘స్మార్ట్’ చదువులు..
ప్రాథమిక పాఠశాలల్లో 3,4,5 తరగతుల విద్యార్థులకు ఇప్పటికే స్మార్ట్‌టీవీల ద్వారా బోధిస్తున్నారు. ఇప్పటికే తొలివిడతగా జిల్లాకు స్మార్‌టీవీలు వచ్చాయి. రెండోవిడతగా కూడా తక్కిన స్కూళ్లకు త్వరలోనే సరఫరా కానున్నాయి.ఇక 6–10 తరగతుల విద్యార్థులకు బోధన కోసం సరఫరా చేసే ఐఎఫ్‌పీలను ప్రతి పాఠశాలలో ఒక్కో తరగతి గదిలో ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య అనుగుణంగా ఒక్కో పాఠశాలకు 15 నుంచి 25 ప్యానళ్లు ఏర్పాటు చేశారు.
ఖర్చుకు వెరవకుండా..
ఒక్కో ఇంటారాక్టివ్ ఫ్ల్లాట్ ప్యానెల్‌ను తరగతి గదిలో ఏర్పాటు చేయడానికి రూ. 1.60 లక్షల దాకా ఖర్చవుతుంది. ఈ ప్రకారం ఒక్కో పాఠశాలకు సంఖ్యను బట్టి రూ. 24 లక్షల నుంచి రూ. 40 లక్షలు ఖర్చు చేస్తున్నారు. తొలివిడత సరఫరా చేసిన ప్యానెళ్లకు రూ.25.26 కోట్లు, రెండోవిడతగా సరఫరా చేస్తున్న ప్యానెళ్లకు రూ. 25.52 కోట్లు కలిపి మొత్తం రూ. 50.78 కోట్లు ఖర్చు చేశారు. ప్రభ్వుత్వ పాఠశాలల్లో చదవుతున్న విద్యార్థులకు అత్యాధునిక బోధన అందించాలనే దృఢ సంకల్పంతో ఉన్న జగన్ ప్రభుత్వం ఖర్చుకు వెనకడుగు వేయడం లేదు.
డిజిటల్ చదువులకు సర్కారు పెద్దపీట
రెండోవిడతగా ఇంటరాక్టివ్ ఫ్ల్లాట్ ప్యానెళ్ల పంపిణీకి శ్రీకారం
ఎంఈఓలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లాకు రెండోవిడతలో 340 స్కూళ్లకు 1,579 ఐఎఫ్‌పీలు వస్తున్నాయి. నేరుగా ఆయా స్కూళ్లకు తీసుకొస్తారు. మండల విద్యాశాఖ అధికారులు వాటిని కంపెనీ వారితోనే తరగతి గదుల్లో ఇన్‌స్టాల్ చేయించాలి. నాడు–నేడు కింద ఎంపికై న అన్ని స్కూళ్లకు దాదాపు వచ్చినట్లే.
– వి.నాగరాజు,
జిల్లా విద్యాశాఖ అధికారి
