
తాడిపత్రి: బడుగు,బలహీన వర్గాల వారికి తగిన గౌరవం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని మంత్రులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకూ సముచిత స్థానం లభించిందని పేర్కొన్నారు. సోమవారం తాడిపత్రి పట్టణంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతమైంది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ఉషశ్రీ చరణ్‌తో పాటు ఎంపీలు తలారి రంగయ్య, నందిగం సురేష్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ, వైఎస్సార్ సీపీ ఉరవకొండ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన్ లిఖిత, ఆర్టీసీ జోనల్ చైర్‌పర్సన్ మంజుల, పార్టీ జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు సైఫుల్లా, రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేసిన ఖ్యాతి జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. మంచి స్కిల్స్ ఉన్న సీఎంగా జగనన్న పేరు గడిస్తే, సీఎం పీఠాన్ని దుర్వినియోగం చేసి స్కాంలు చేసిన వ్యక్తిగా టీడీపీ అధినేత చంద్రబాబు చరిత్రకెక్కారన్నారు. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అన్న వ్యక్తి నేడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనను పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డిని మళ్లీ ఆశీర్వదించాలని కోరారు.
సీఎం జగన్ పాలనలో
అన్ని వర్గాలకూ సముచిత స్థానం
ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట
సామాజిక సాధికారతను వివరించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు
మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపు
తాడిపత్రిలో బస్సు యాత్ర విజయవంతం
పోటెత్తిన జనం
తాడిపత్రిలో సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం పోటెత్తారు. స్థానిక సీబీ రోడ్డు జనసంద్రాన్ని తలపించింది. మధ్యాహ్నం 3.30 గంటలకు భగత్‌సింగ్ నగర్‌లోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా ప్రజాప్రతినిధులు బయలుదేరారు. సిద్ధిబాష దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ర్యాలీ వైఎస్సార్ సర్కిల్‌కు చేరుకుంది. దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, సభాస్థలి వద్దకు చేరుకున్నారు. ర్యాలీ ఆద్యంతం జై జగన్.. నినాదాలు మార్మోగాయి. సభ ప్రారంభానికి ముందు సీఎం జగన్ పాలనపై వినిపించిన పాట అందరినీ ఉర్రూతలూగించింది.


దర్గాలో ప్రార్థనలు చేస్తున్న ప్రజాప్రతినిధులు