
శింగనమల జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న ఎస్పీడీ శ్రీనివాసరావు
శింగనమల: మండల కేంద్రం శింగనమలలోని కేజీబీవీ ఎస్‌ఓ గీతారాణి, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సుజాతపై సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఎస్పీడీ) శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఆయా పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీలో అన్నం ముద్దగా ఉండటం, ఆర్వో ప్లాంట్ పనిచేయకపోవడం, కూరగాయలు నాణ్యతగా లేకపోవడం గమనించి ఎస్‌ఓను నిలదీశారు. ఇక్కడ సిబ్బంది సమస్య ఉందని, తానే ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకుంటున్నానంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన ఎస్‌ఓపై ఎస్పీడీ సీరియస్ అయ్యారు. ‘రాజీనామా చేయాలనుకుంటే చేయండి.. మీ స్థానంలో కొత్తవారిని తీసుకుంటాం.. ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన కలెక్టర్‌కు ఫోన్ ద్వారా తెలిపారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. నెల తరువాత తిరిగి వస్తానని, సమస్యలు పరిష్కారం కావాలన్నారు. తర్వాత జెడ్పీ హైస్కూల్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులు అటు ఇటు తిరుగుండటం గమనించి ఆరా తీస్తే.. ఉపాధ్యాయులు రాలేదని తెలిసింది. అటెండెన్స్‌లో చాలామంది టీచర్లు లీవు పెట్టి ఉండటం కనిపించింది. అక్కడి నుంచి తరగతి గదుల్లోకి వెళ్లి పాఠ్యాంశాలపై అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు చెప్పలేకపోయారు. దీంతో హెచ్‌ఎం సుజాతపై ఎస్పీడీ అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు పనితీరు మార్చుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏఎంఓ చంద్రశేఖర్‌రెడ్డి, సీఎంఓ వేణుగోపాలు, ఎంఈఓ నరసింహరాజు ఉన్నారు.
కేజీబీవీ విద్యార్థినులు దేశం గర్వించే
స్థాయికి ఎదగాలి
అనంతపురం ఎడ్యుకేషన్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) చదువుతున్న అనాథ, పేద ఆడ పిల్లలు దేశం గర్వించేస్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దాలని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఎస్పీడీ) శ్రీనివాసరావు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీవీల్లో కొత్తగా చేరిన సీఆర్టీలు, పీజీటీలకు అనంతపురం నగర శివారులోని వైవీ శివారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఆరు రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులను రెండోరోజు శుక్రవారం ఎస్పీడీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించాలన్నారు. చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించాలన్నారు. కేజీవీవీల్లో దివ్యాంగ విద్యార్థినులకు వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలు కల్పించి ప్రత్యేక టీచర్లను ఏర్పాటు చేస్తామన్నారు. శిక్షణ కేంద్రంలో ఏ ఒక్కరూ సెల్‌ఫోన్ వాడరాదన్నారు. ఇక్కడ తీసుకొనే శిక్షణ జీవితాంతం గుర్తుంటుందన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు భవిష్యత్తులో ఏవిధంగా ఉండాలి అనే అంశాలపై కూడా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండాలన్నారు. అనంతరం శిక్షణ కేంద్రంలో సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేజీబీవీ విభాగం జాయింట్ డైరెక్టర్ గీత, జీసీడీఓ మహేశ్వరి, ఏఎంఓ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్డీటీ ఐఈ కోఆర్డినేటర్ రామ్‌కమల్, సమగ్ర శిక్ష రాష్ట్ర పరిశీలకులు మహేశ్వర్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, ప్రసాద్, సోనాలి, అబ్రహాం, అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారులు గోపాలకృష్ణయ్య, చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment