
అనంతపురం శ్రీకంఠంసర్కిల్/రాప్తాడు రూరల్: అనంతపురం లో బుధవారం వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న రెండు హత్యలు నగరవాసులను ఉలిక్కిపడేలా చేశాయి. అత్త వేధింపులు తాళలేక సోదరుడితో కలిసి ఆమె ను కోడలు హతమార్చగా, గొడవపడుతున్న వారిని మందలించిన పాపానికి వ్యక్తిని వేటకొడవళ్లతో దారుణంగా నరికిచంపిన ఘటనలు కలకలం రేపాయి.
టమాటా మండీ వద్ద దారుణహత్య
అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి పంచాయతీ పరిధిలోని టమాటా మండీలో కక్కలపల్లి గ్రామానికి చెందిన కురుబ బిల్లే శ్రీనివాసులు (40) దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన హత్య బుధవారం ఉదయం వెలుగులోకి రావడంతో ఆ ప్రాంతం ఉలిక్కి పడింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బిల్లే శ్రీనివాసులు చురుకుగా వ్యవహరిస్తుండేవాడు. టమాటా మండీ గేటు వసూలు టెండర్‌ను దక్కించుకున్నాడు. మంగళవారం రాత్రి టమాటా మండీ సమీపంలో ప్రజాశక్తినగర్‌కు చెందిన వంశీ, మున్నా, సుబ్రమణ్యం తదితరులు మద్యం సేవించారు. ఇదే సమయంలో శ్రీనివాసులు కూడా వీరికి సమీపంలోనే ఉన్నాడు. మద్యం మత్తులో వంశీ, మున్నా గొడవ పడ్డారు.
శ్రీనివాసులు కలగజేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పాడు. ఈ క్రమంలోనే వంశీపై చేయి చేసుకున్నాడు. అయితే జులాయిగా తిరిగే వంశీ రెండేళ్ల క్రితం కక్కలపల్లి గ్రామానికి చెందిన యువకుడిపై అకారణంగా చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో గ్రామస్తులు వంశీకి దేహశుద్ధి చేశారు. వంశీని కొట్టినవారిలో శ్రీనివాసులు కూడా ఉన్నాడు. ఆ తర్వాత పలు సందర్భాల్లోనూ వంశీ చేస్తున్న చిల్లర పనులను శ్రీనివాసులు ఖండిస్తూ వచ్చాడు. దీన్ని వంశీ మనసులో పెట్టుకున్నాడు. వంశీ, మున్నా గొడవ పడుతున్న సందర్భంలో అడ్డువచ్చిన శ్రీనివాసులుపై అప్పటికే తన వద్ద ఉంచుకున్న కొడవలితో దాడి చేశాడు.
తలపై బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సునీత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఘటనా స్థలానికి దిశ డీఎస్పీ ఎ.శ్రీనివాసులు, సీఐ విజయభాస్కర్‌గౌడ్, ఎస్‌ఐలు నబీరసూల్, వెంకటరమణ, సిబ్బంది చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం సర్వజన ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సర్పంచ్ గాండ్ల కృష్ణయ్య, జెడ్పీటీసీ సభ్యుడు జూటూరు చంద్రకుమార్ ఇతర నాయకులతో మాట్లాడి కారణాలను అడిగి తెలుసుకున్నారు.
టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే హత్య!
టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే తమ పార్టీ కార్యకర్త కురుబ శ్రీనివాసులు హత్యకు గురయ్యారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. హత్య విషయం తెలుసుకున్న వెంటనే కక్కలపల్లికి చేరుకున్న ఎమ్మెల్యే.. శ్రీనివాసులు కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో శ్రీనివాసులు భౌతికకాయానికి నివాళులర్పించారు. సాయంత్రం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్యతో కలిసి ఎస్పీ ఫక్కీరప్పను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కురుబ శ్రీనివాసులు వైఎస్సార్‌సీపీలో చురుకై న కార్యకర్త అని తెలిపారు.
లోకేష్ పాదయాత్ర సందర్భంగా కాటిగానికాలువ సమీపంలో మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు డిన్నర్ ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఇందులో పాల్గొన్న నిందితులు పూటుగా మద్యం తాగి వచ్చి రాత్రికి హత్య చేశారని ఆరోపించారు. దీంతోనే తెలుగుదేశం నాయకులు ప్రేరేపించినట్లు అర్థమవుతోందన్నారు. ప్రజాశక్తినగర్‌లో రౌడీమూకలను అరికట్టాలని కోరారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, పార్టీ మండల కన్వీనర్ బండి పవన్, సర్పంచ్ గాండ్ల కృష్ణయ్య తదితరులున్నారు.