
● ‘నైట్ విజన్’లో పదో తరగతి విద్యార్థులకు డీఈఓ సూచన
రాప్తాడురూరల్: ‘ఏమ్మా టీవీలు చూస్తున్నారా..! పదో తరగతి పబ్లిక్ పరీక్షలు దగ్గరకొచ్చాయి. ఈ కొద్దిరోజులు సెల్‌ఫోన్లు, టీవీలు కట్టిపెట్టండి తల్లీ..’ అంటూ డీఈఓ సాయిరామ్ విద్యార్థినులకు సూచించారు. నైట్‌విజన్‌లో భాగంగా బుధవారం రాత్రి అనంతపురంలోని జీసస్‌నగర్‌లో గల మైనార్టీ వెల్ఫేర్ బాలికల వసతి గృహానికి వెళ్లారు. అలాగే సమీపంలోని విద్యార్థినుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. పదో తరగతి.. విద్యార్థి జీవితానికి మలుపు అన్నారు. తొలిసారి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారని.. ఏకాగ్రతతో చదువుకోవాలని సూచించారు. ఇళ్లు, హాస్టళ్ల వద్ద పిల్లలు చదువుకునే వాతావరణం కల్పించాలన్నారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను అడియాసలు చేయవద్దని విద్యార్థినులను కోరారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని మంచి శ్రేణితో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట శ్రీకృష్ణదేవరాయ నగరపాలక ఉన్నత పాఠశాల హెచ్‌ఎం, వసతిగృహం వార్డెన్, ఉపాధ్యాయులు ఉన్నారు.
ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
అనంతపురం అర్బన్/ శ్రీకంఠం సర్కిల్: జిల్లా ప్రజలకు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పీ కె.ఫక్కీరప్ప శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు ఆచరించిన జీవన విధానం పరిపూర్ణ మానవ జీవితానికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. శ్రీరాముని చల్లని దీవెనలతో జిల్లా సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు.
వర్సిటీల పాలకమండలి సభ్యుల గడువు పొడిగింపు
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యుల పదవీ కాలం మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ జె.శ్యామలారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండు యూనివర్సిటీల పాలక మండళ్లు 2020 మార్చి 23వ తేదీన నియామకమయ్యాయి. మూడేళ్ల పదవీకాలం ఈ మార్చి 22కు పూర్తయింది. పాలకమండలి సభ్యుల ప్యానళ్ల ఏర్పాటుకు మరింత సమయం అనివార్యం కావడంతో పాత పాలక మండలి సభ్యుల పదవీకాలం రెండు నెలల పాటు పొడిగించారు. నిర్దేశించిన రెండు నెలలలోపు పాలకమండలి సభ్యుల నియామకం పూర్తిచేయనున్నట్లు ఉన్నత విద్యామండలి సెక్రటరీ ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీకి విన్నవించుకోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
స్కాలర్‌షిప్‌కు ఎంపిక పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్: హిందూస్తాన్ యూనిలీవర్, హైదరాబాద్ వారు 25 మంది బాలిక/మహిళా క్రికెటర్లకు స్కాలర్‌షిప్ అందించనుంది. ఇందు కోసం ఏప్రిల్ రెండో తేదీ ఉదయం 8 గంటలకు అనంత క్రీడా మైదానంలో క్రికెట్ పోటీల ద్వారా ఎంపిక చేయనున్నారు. 12 నుంచి 20 ఏళ్లలోపు అమ్మాయిలు యూనిఫాం, క్రికెట్ కిట్, సర్టిఫికెట్లతో ఎంపిక పోటీలకు హాజరుకావాలన్నారు.

మాట్లాడుతున్న డీఈఓ సాయిరామ్