కోవిడ్‌పై సమరానికి సిద్ధం

- - Sakshi

కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం

ప్రభుత్వ సర్వజనాస్పత్రి, ‘సూపర్‌ స్పెషాలిటీ’లో ఏర్పాట్లు

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: కోవిడ్‌ మరోసారి అలజడి రేపుతోంది. దేశంలో ఒక్కసారిగా పాజిటివ్‌ కేసుల్లో పెరుగదల కనిపించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లా అధికార యంత్రాంగం కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు అప్రమత్తమైంది. అనంతపురం శివారు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో అతనిని ప్రస్తుతం పూర్తిస్థాయి పర్యవేక్షణలో ఉంచారు.

ప్రత్యేక బెడ్ల ఏర్పాటు

అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఐడీ వార్డులో కోవిడ్‌ రోగుల కోసం ప్రత్యేకంగా 20 బెడ్లు సిద్ధం చేశారు. ఇందులో 5 బెడ్లు ప్రత్యేకమైన వసతుల (హై ఫ్లో ఆక్సిజన్‌)తో ఏర్పాటు చేశారు. వీటితోపాటు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో మరో 200 బెడ్లను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. కేసుల తీవ్రత పెరిగినా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉన్నామని అధికారులు తెలిపారు.

గత నవంబర్‌లో ఒక కేసు..

జిల్లాలో గతేడాది నవంబర్‌లో ఒక కోవిడ్‌ కేసు నమోదైనట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. సదరు కేసుకు సంబంధించి తీవ్రత, వ్యాప్తి కూడా పూర్తిగా లేకపోవడంతో అనుమానిత వ్యక్తికి పూర్తిస్థాయిలో వైద్యాన్ని అందించి డిశ్చార్జ్‌ చేశారు. తాజాగా నమోదైన కేసు కూడా వచ్చి వారం రోజులు దాటినందున ఎలాంటి భయాందోళనలూ చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు.

పూర్తిస్థాయిలో ఆక్సిజన్‌ ప్లాంట్లు

కోవిడ్‌ రోగుల కోసం మూడు ఆక్సిజన్‌ ప్లాంట్లను సిద్ధం చేశారు. సర్వజనాస్పత్రి ప్రాంగణంలో 13 కేఎల్‌ సామర్థ్యం కలిగిన ఆక్సిజన్‌ ప్లాంట్‌లో ప్రస్తుతం 9 కేఎల్‌, 10 కేఎల్‌ సామర్థ్యం కలిగిన మరో ప్లాంట్‌లో 4.7 కే ఎల్‌ లిక్విడ్‌ ఆక్సిజన్‌ అందుబాటులో ఉంది. వీటితో పాటు అదనంగా ఎన్విరాన్‌మెంటల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ కూడా సిద్ధంగా ఉంది.

అప్రమత్తంగా ఉన్నాం

కోవిడ్‌ రోగులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశాం. బెడ్లు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లను సిద్ధంగా ఉంచాం. సిబ్బందిని ఆయా పరిస్థితుల దృష్ట్యా నియమించేందుకు ఏర్పాట్లు చేస్తాం. ప్రస్తుతం కోవిడ్‌ తీవ్రత, వ్యాప్తి లేనందున భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. పూర్తి అప్రమత్తంగానే ఉన్నాం.

– డాక్టర్‌ రఘునందన్‌, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌, అనంతపురం

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top