మద్దిలపాలెం: అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మించి అద్భుత ప్రదర్శనలు ఇస్తున్న సురభి నాటకాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు కావాలని వక్తలు ఆకాంక్షించారు. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో భానోదయ నాట్య మండలి నిర్వహిస్తున్న సురభి నాటకోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం సాయంత్రం ప్రదర్శించిన ‘భూకై లాస్’ నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రంగస్థల నటులు మీగడ రామలింగస్వామి, చలసాని కృష్ణప్రసాద్, కొరిటాల ప్రభాకర్, పైడా కృష్ణప్రసాద్, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రంగస్థల కళాకారుల సంఘం కార్యదర్శి వంకాయల మారుతి ప్రసాద్, కళాపోషకులు నమ్మి అప్పలరాజు, బిల్డర్ రామకృష్ణ, రిటైర్డ్ ఏసీపీ మహమ్మద్ ఖాన్, గాయని మణిపల్లవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సురభి నాటక కళను ఆదరించి, ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అనంతరం ప్రదర్శించిన ‘భూకై లాస్’ నాటకంలో ఒక్కో ఘట్టం సినిమాను తలపించేలా సాగింది. సురభి కళాకారుల అద్భుత నటన, మంత్రముగ్ధులను చేసే స్టేజ్ టెక్నాలజీతో కళాభారతి హాల్ కరతాళ ధ్వనులతో మారుమోగింది. నటి శివజ్యోతి, కోఆర్డినేటర్ భానుప్రసాద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా, సీనియర్ జర్నలిస్ట్ నాగనబోయిన నాగేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.


