ఇదండీ జీవీఎంసీ వరస..! | - | Sakshi
Sakshi News home page

ఇదండీ జీవీఎంసీ వరస..!

Jun 20 2026 12:25 AM | Updated on Jun 20 2026 12:25 AM

డాబాగార్డెన్స్‌: నగరంలో మండే ఎండల నుంచి బాటసారులు, వాహనదారులకు ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో జీవీఎంసీ ‘హరితాశ్రయం’ పేరుతో పలు ప్రాంతాల్లో గ్రీన్‌ షెల్టర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పైలట్‌ ప్రాజెక్టుగా గత మే నెలలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని గురజాడ విగ్రహం వద్ద గ్రీన్‌ షేడ్‌ నెట్‌ను ఏర్పాటు చేసింది. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగే వాహనదారులు, పాదచారులు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేలా నీటి తుంపర్లు చల్లే విధానాన్ని కూడా ఇంజినీరింగ్‌ విభాగం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఈ ఏర్పాటు ఎక్కువకాలం నిలవలేదు. సుమారు 20 రోజుల క్రితం నగరంలో వీచిన ఈదురుగాలులకు గ్రీన్‌ షెల్టర్‌ నెట్‌ పూర్తిగా దెబ్బతింది. దాన్ని మరమ్మతు చేయడం లేదా పునరుద్ధరించడం పక్కనపెడితే, ఎండాకాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమైన తర్వాత జీవీఎంసీ మరో గ్రీన్‌ షెల్టర్‌ను సత్యం జంక్షన్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. దాదాపు రెండున్నర నెలల పాటు నగరవాసులు భానుడి ప్రతాపానికి అల్లాడిన సమయంలో కాకుండా, వర్షాలు కురుస్తున్న వేళ ఈ ఏర్పాట్లు చేపట్టడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవసరం ఉన్న సమయంలో కాకుండా ఆలస్యంగా చేపట్టిన చర్యలతో జీవీఎంసీ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement