మన్మథలీలలు! | - | Sakshi
Sakshi News home page

మన్మథలీలలు!

Jun 20 2026 12:25 AM | Updated on Jun 20 2026 12:25 AM

మహిళా వైద్యులతో
విమ్స్‌ డైరెక్టర్‌పై ఆరోపణల కలకలం డాక్టర్ల గ్రూపులో వైరల్‌గా వాయిస్‌ మెసేజ్‌ మహిళా డాక్టర్లు, సిబ్బందితో అభ్యంతరకర భాష పీజీలను పాస్‌ చేసేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు మరోసారి వివాదాల్లోకి కేజీహెచ్‌ జనరల్‌ సర్జరీ విభాగం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

కేజీహెచ్‌ జనరల్‌ సర్జరీ విభాగం చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇదే విభాగానికి చెందిన డాక్టర్‌ జనార్దన్‌రావుపై సస్పెన్షన్‌ చర్యలు తీసుకున్న నేపథ్యంలో.. తాజాగా ఆ విభాగానికి గతంలో హెచ్‌వోడీగా పనిచేసి ప్రస్తుతం విమ్స్‌ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ మన్మథరావుపై కూడా పలు ఆరోపణలు వెలుగులోకి రావడం వైద్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒక మహిళా వైద్యురాలి భర్త అయిన వైద్యుడు.. డాక్టర్ల వాట్సాప్‌ గ్రూపులో పోస్టు చేసిన వాయిస్‌ మెసేజ్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వాయిస్‌ మెసేజ్‌లో డాక్టర్‌ మన్మథరావు మహిళా వైద్యులు, సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని, తన భార్య పట్ల ఇతరుల వద్ద అభ్యంతరకర పదజాలం ఉపయోగించారని వాపోయారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా పీజీ వైద్య విద్యార్థులను పరీక్షల్లో ఉత్తీర్ణులను చేయడానికి డబ్బులు తీసుకున్నారంటూ కూడా ఆరోపణలు చేశారు. బోధన కంటే ఇతర అంశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారని, విద్యార్థులకు తగిన శిక్షణ అందించలేదని వాయిస్‌ మెసేజ్‌లో విమర్శించారు. సాయంత్రం వేళల్లో విస్తృతంగా ప్రైవేటు ప్రాక్టీస్‌ నిర్వహించారన్న ఆరోపించారు.

పైసలిస్తేనే పాస్‌..?

కేజీహెచ్‌ జనరల్‌ సర్జరీ విభాగానికి మొన్నటివరకు హెచ్‌వోడీగా ఉన్న డాక్టర్‌ మన్మథరావుపై తాజాగా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి అండదండలతోనే ఆయనకు విమ్స్‌ డైరెక్టర్‌ పదవి దక్కిందన్న చర్చ వైద్య వర్గాల్లో సాగుతోంది. జనరల్‌ సర్జరీ హెచ్‌వోడీగా ఉన్నప్పుడు విద్యార్థులకు బోధన చేయకుండా కాలం గడిపారన్న విమర్శలు ఉన్నాయి. పీజీ విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలంటే డబ్బులు చెల్లించాల్సి వచ్చేదన్న ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. బోధన కంటే వసూళ్లకే ప్రాధాన్యం ఇచ్చారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే విభాగంలోని ఇతర అధ్యాపకులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తుండగా, పరిపాలనాపరమైన పెత్తనానికే పరిమితమయ్యారన్న అంశం కూడా వైరల్‌ అవుతున్న వాయిస్‌ మెసేజ్‌లో ప్రస్తావనకు వచ్చింది. ఇక ప్రభుత్వ సేవలో ఉంటూనే సాయంత్రం వేళల్లో ప్రైవేటు ప్రాక్టీస్‌ నిర్వహించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పీజీ విద్యార్థులను పాస్‌ చేయడంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలే ఇప్పుడు వైద్య వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ఇదే విభాగంలో పనిచేస్తున్న డాక్టర్‌ మహాలక్ష్మి భర్త ఈ వాయిస్‌ మెసేజ్‌ను డాక్టర్ల గ్రూపులో పోస్టు చేశారు. తన భార్యను ఎలాంటి కారణం లేకుండానే యూనిట్‌–1 నుంచి యూనిట్‌–3కు బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. తాను కూడా రాజాం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడినేనని ఆ సందేశంలో పేర్కొన్నారు.

వివాదంలో జనరల్‌ సర్జరీ విభాగం

కేజీహెచ్‌ గత కొంతకాలంగా వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. వైద్య పరికరాల మరమ్మతులకు నిధుల కొరత కారణంగా గుండె శస్త్రచికిత్సలు నిలిచిపోయిన ఘటన నుంచి మందుల కొరత వరకు పలు అంశాలు ఇప్పటికే చర్చనీయాంశమయ్యాయి. కృత్రిమ గర్భధారణ వ్యవహారంలోనూ కేజీహెచ్‌కు చెందిన వైద్యులపై ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో జనరల్‌ సర్జరీ విభాగం మరోసారి వివాదాల కేంద్రంగా మారింది. ఇదే విభాగానికి చెందిన డాక్టర్‌ జనార్దన్‌రావుపై పీజీ విద్యార్థులు లైంగిక, మానసిక, వృత్తిపర వేధింపుల ఆరోపణలతో ఏఎంసీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించడంతో ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆ ఘటన చల్లారకముందే ఇప్పుడు ఇదే విభాగానికి గతంలో హెచ్‌వోడీగా పనిచేసిన డాక్టర్‌ మన్మథరావుపై కూడా పలు ఆరోపణలు వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహిళా వైద్యుల పట్ల వ్యవహరించిన తీరు, పీజీ విద్యార్థుల పరీక్షల విషయంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న వాదనలు, బోధన కంటే ఇతర అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శలు వైద్య వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అలాగే ప్రైవేటు ప్రాక్టీస్‌ ద్వారా భారీగా ఆదాయం ఆర్జించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. విమ్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్‌ మన్మథరావుపై వచ్చిన ఈ ఆరోపణల నేపథ్యంలో సంబంధిత అధికారులు ఎలాంటి విచారణ చేపడతారు, తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement