రోడ్లు వేయండి... మోత తప్పించండి | - | Sakshi
Sakshi News home page

రోడ్లు వేయండి... మోత తప్పించండి

Jun 20 2026 12:25 AM | Updated on Jun 20 2026 12:25 AM

డోలీమోతలతో పీవీటీజీ కొందు గిరిజన గ్రామాల ప్రజల వినూత్న నిరసన

చోడవరంలో నిరసన ర్యాలీ

జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత

చోడవరం : తమ గిరిజన గ్రామాలకు రోడ్లు వేసి తమకు డోలీమోత రవాణా సమస్యను పరిష్కరించాలని కోరుతూ పీవీటీజీ కొందు గిరిజన గ్రామాల గిరిజనులు ఆందోళనకు దిగాయి. ఒక నియోజకవర్గం నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా చోడవరంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌ రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తమ సమస్యలు తెలుపుకొనేందుకు రావికమతం, రోలుగుంట మండలాల పరిధిలో ఉన్న పీవీటీజీ కొందు గిరిజన గ్రామాల ప్రజలు చోడవరం తరలివచ్చారు. తమ గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేక డోలిమోతతో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నామో అధికారులకు, ప్రజలకు తెలిసే విధంగా డోలిమోతలతో వినూత్న నిరసన తెలిపారు. ఇక్కడి తహసీల్దార్‌ కార్యాలయం నుంచి కొత్తూరు జంక్షన్‌ మీదుగా రెవిన్యూ సదస్సు జరిగే ప్రదేశానికి ర్యాలీగా వచ్చారు. అక్కడ జిల్లా కలెక్టర్‌ను, ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. అర్ల నుంచి పిత్రిగెడ్డ రోడ్డును, వైబీపట్నం నుంచి నో సింగి, పెద్దగవురు రోడ్డును జెడ్‌ జోగుంపేట నుంచి నేరేడు బంధ రోడ్డును వేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు తెలియజేశారు. రోడ్డులేక డోలీమోతతో ప్రయాణం చేయాల్సి వస్తుందని, అత్యవసర సమయాల్లో మరింత ఇబ్బందులు పడుతున్నామని వారు విన్నవించారు. అదేవిధంగా లోసింగి, కొమ్మరి గిరిజన గ్రామాల్లో అంగన్‌వాడీ, పాఠశాల భవనాలు నిర్మించాలని కోరారు. మరో పక్క గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ రైతులకు, కార్మికులకు వెంటనే చెరకు బకాయిలు చెల్లించాలని కోరుతూ సీఐయూటీ నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ ఆందోళనలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, గిరిజన సంఘాల నాయకులు కొండతాంబలి వెంకట్రావు, కొర్ర కొండబాబు, డిప్పల అప్పారావు, గెమ్మిల సత్తిబాబు, ఎస్వీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుండగా ఆందోళన చూస్తూ వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వారిని జిల్లా కలెక్టర్‌ సదస్సులో ఉన్న ఎమ్మెల్యే రాజు బయటకు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకొని వినతిపత్రం తీసుకున్నారు. ఆయా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement