ఏకోపాధ్యాయ..విద్యార్థులు సున్నా! | - | Sakshi
Sakshi News home page

ఏకోపాధ్యాయ..విద్యార్థులు సున్నా!

Jun 20 2026 12:25 AM | Updated on Jun 20 2026 12:25 AM

పాఠశాల తెరిచి వారం అయినా చేరని విద్యార్థులు

టేబుళ్లను చూస్తూ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు

బూరుగుపాలెం ప్రాథమిక పాఠశాలలో వింత పరిస్థితి

మాకవరపాలెం : కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు పడుతుంటారు. అయినా ఉన్న వారితోనే పాఠశాలలను నిర్వహించేస్తారు. కానీ ఈ పాఠశాలలో విద్యార్థులు లేకపోయినా డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయుడిని నియమించడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది పాఠశాలలు తెరుచుకున్న నాటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మండలంలోని బూరుగుపాలెంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఈ పరిస్థితి నెలకుంది. ఈ పాఠశాలలో గతేడాది ఒక నుంచి ఐదో తరగతి వరకు ఇద్దరే విద్యార్థులు ఉండేవారు. అయితే రెగ్యులర్‌గా పనిచేసే ఉపాధ్యాయని వేసవి సెలవులకు ఆరు నెలల ముందే వ్యక్తిగత కారణాలతో ముందస్తు పదవీ విరమణ చేశారు. దీంతో ఈ పోస్టు ఖాళీ అయిన నేపథ్యంలో అప్పటి నుంచి అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌తోనే పాఠశాల నిర్వహించారు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12న పాఠశాల తెరుచుకున్నా ఇప్పటి వరకు ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఇదే గ్రామంలో ఉన్న హైస్కూల్లో 1–10 వరకు ఉండడంతో విద్యార్థులు హైస్కూల్లో చేరేందుకే ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు లేకపోయినా రోజూ ఒక ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై ఉంచుతున్నారు. ఈ ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉన్న టేబుళ్లను చూసుకుంటూ కూర్చోవడం తప్పితే ఏమీ లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. విద్యార్థులు లేని ఈ పాఠశాలకు ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement