మునగపాక : వ్యవసాయ మోటార్లకు ఇచ్చిన విద్యుత్ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మండలంలోని వెంకటాపురంలో వ్యవసాయ మోటార్లకు ఏర్పాటు చేసిన మీటర్లతో పాటు విద్యుత్ బిల్లులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందన్నారు. వ్యవసాయ మోటార్లకు సంబంధించి వేల నుంచి లక్షలాది రూపాయల మేర బిల్లులు చెల్లించాలంటూ రైతులపై ఒత్తిడి పెరగడం విచారకరమన్నారు. బిల్లులు చెల్లించకుంటే విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తామంటూ భయభ్రాంతులకు గురిచేయడం అన్యాయమన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. అలాగే టి.సిరసపల్లి, రాజుపేట, నాగవరం గ్రామాల్లో కూడా అధిక మొత్తంలో బిల్లులు రావడం చూస్తుంటే బాధ కలుగుతుందన్నారు. తక్షణమే విద్యుత్ బిల్లులను రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. లేకుంటే రానున్న రోజుల్లో రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ గనిశెట్టి సత్యనారాయణ, ఎన్.నారాయణ, కె.కృష్ణ, గోవిందరావు, మహలక్ష్మీరావు, సన్యాసిరావు, ముత్యాలనాయుడు పాల్గొన్నారు.


