న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
● రైతుల భూముల్లో ఏపీఐఐసీ దౌర్జన్యం
● నష్టపరిహారం చెల్లించకుండా
కొబ్బరి తోటల ఽతొలగింపు
● అడ్డుకున్న రైతుపై పోలీసు కేసు
బరితెగింపు
నక్కపల్లి: మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు భూములు అప్పగించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అత్యుత్సాహం చూపించడంతో పాటు బరితెగిస్తోంది. నష్టపరిహారం చెల్లించకుండా రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కొంటోంది. ఏపీఐఐసీ ఽఅధికారులను పంపించి రైతులపై దౌర్జన్యానికి పాల్ప డుతోంది. రైతుల భూముల్లో కొబ్బరి, జీడిమామిడి తోటలు తొలగిస్తోంది. ఏపీఐఐసీ దౌర్జన్యాన్ని అడ్డుకుంటున్న తమపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. మిట్టల్‌స్టీల్‌ప్లాంట్‌కు భూములు కేటాయించే విషయంలో ప్రభుత్వం ఏపీఐఐసీని అడ్డంపెట్టుకుని చేస్తున్న దౌర్జన్యాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. బాధిత రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో బుచ్చిరాజుపేటలో సర్వేనంబరు 210/1లో యలమంచిలి చిన అప్పారావుకు 30 సెంట్ల భూమి ఉంది. ఈ భూమి పూర్వీకులనుంచి సంక్రమించింది. ఈ భూమిలో కొబ్బరి తోటలు వేసి వచ్చిన ఫలసాయంతో కుటుంబాన్ని పోషించుకున్నాడు. అప్పారావు కొద్దిసంవత్సరాల క్రితం మరణించాడు.అతని కుమారుడు రమేష్ తన తండ్రి ద్వారా వచ్చిన భూమిని సాగుచేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ భూమిని ప్రభుత్వం పరిశ్రమల స్థాపన కోసం ఏపీఐఐసీ ద్వారా సేకరించింది. భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ పర్చేజింగ్ పేరుతో కొనుగోలు చేస్తున్నారు. గతంలో 2010లో ఏపీఐఐసీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి సేకరించిన భూములకు ఎకరాకు రూ.18లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించారు. ఆ భూముల్లో ఉన్న జీడి,మామిడి, కొబ్బరి తోటలకు అదనంగా పరిహారం చెల్లించారు. ప్రస్తుతం యలమంచిలి అప్పారావుకు చెందిన భూమిని నోటిఫికేషన్‌లో పేర్కొనకుండా 2018లో డైరెక్ట్ పర్చేజింగ్ ద్వారా కొనుగోలుకు చర్యలు చేపట్టారు. ఎకరాకు రూ.18లక్షల చొప్పున ధర నిర్ణయించి 10సెంట్ల భూమికి నష్టపరిహారం కింద 2018 సంవత్సరం అక్టోబర్ 2న రూ.1.98 లక్షలు చెల్లించారు. మిగిలిన 20 సెంట్ల భూమికి నష్టపరిహారం చెల్లించలేదు. నష్టపరిహారం చెల్లించాలని అప్పారావు ఏపీఐఐసీ అధికారులకు పలు పర్యాయాలు వినతి పత్రాలు ఇచ్చాడు. తిరిగి, తిరిగి అనారోగ్యం పాలై అప్పారావు 2018లో మరణించాడు. తర్వాత ఇతని కుమారుడు యలమంచిలి రమేష్.. ఏిపీఐఐసీ వారు కొనుగోలు చేసిన భూమికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ అధికారుల చుట్టూతిరుగుతున్నాడు. 2021 సంవత్సరం డిసెంబర్ 13న ఒకసారి, 2024 సంవత్సరం సెప్టెంబర్ 17న మరోసారి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌లో దరఖాస్తు ఇచ్చాడు. ఇంతలో అప్పారావుకు చెల్లించాల్సిన నష్టపరిహారం ఏపీఐఐసీ అధికారులు సర్వేనంబరు 191లో భూమి కలిగిన దూళి నూకరాజు అనే వ్యక్తి పేరున గల శిరీష కంపెనీ వారిపేరున జమ చేసినట్లు చావు కబురు చల్లగా చెప్పారు. తమ భూమికి వేరొకరి పేరున నష్టపరిహారం ఎలా జమ చేస్తారని అప్పారావు కొడుకు రమేష్ అధికారులను నిలదీస్తున్నప్పటికీ ఏపీఐఐసీ అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఈవ్యవహారం గడచిన ఏడేళ్లనుంచి నడుస్తోంది. 20 సెంట్ల భూమి మాత్రం అప్పారావు కుటుంబం సాగులోనే ఉంది. ఇటీవల మిట్టల్‌స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేయడంతో ఈ భూములను తక్షణమే ఖాళీ చేసి స్టీల్‌ప్లాంట్‌కు అప్పగించాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో ఆగమేఘాల మీద రెండు రోజుల క్రితం అప్పారావుకు చెందిన 20 సెంట్ల భూమిలో ఉన్న కొబ్బరి చెట్లను ఏపీఐఐసీ అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించారు. దీన్ని అడ్డుకునేందుకు వెళ్లిన అప్పారావు కుమారుడు రమేష్, ఇతని బంధువైన జి.బాబూరావు తదితరులపై దౌర్జన్యానికి పాల్పడటమే కాకుండా బాధితరైతులపై అక్రమ కేసులు బనాయించారు. ఇలా మరో పది మంది రైతుల వరకూ నష్ట పరిహారం చెల్లించకుండా ఏపీఐఐసీ అధికారులు దౌర్జనంగా భూములు లాక్కొంటున్నట్టు తెలిసింది. మిట్టల్‌స్టీల్ ప్లాంట్‌కు భూములు అప్పగిండచం కోసం నష్టపరిహారం చెల్లించకుండా తమ భూములను దౌర్జన్యంగా లాక్కొంటున్నారంటూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అఽధికారాన్ని అడ్డంపెట్టుకుని బలవంతంగా భూములు లాక్కొంటోందని, ఒకరికి చెల్లించాల్సిన నష్టపరిహారం మరొకరికి చెల్లిస్తోందని, దీన్ని ప్రశ్నించిన తమపై పోలీసు కేసులు పెడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఏపీఐఐసీ అధికారుల తీరు చాలా దారుణంగా ఉందని వారు వాపోతున్నారు. అన్యాయంగా తమ భూముల్లో కొబ్బరి తోటలు తొలగించారంటూ ఆరోపిస్తున్నారు. రెండేళ్ల నుంచి రేటు పెంచి నేరుగా రైతులనుంచి కొనుగోలు చేసే భూములకు ఆయా పరిధిలో మార్కెట్ విలువను బట్టి ఎకరాకు రూ.36లక్షల వరకు చెల్లిస్తున్నారని, తమకు మాత్రం నోటిఫికేషన్‌లో నిర్ణయించిన ధర మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కేసులు పెట్టి తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ భూమికి నష్టపరిహారం చెల్లించాలంటూ అప్పారావు కుమారుడు రమేష్ పెట్టుకున్న అర్జీ
బుచ్చిరాజుపేటలో అప్పారావుకు చెందిన భూమిలో
ఏపీఐఐసీ అధికారులు దౌర్జన్యంగా తొలగించిన కొబ్బరి చెట్లు
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు నాగరాజు
నర్సీపట్నం: డప్పు కళాకారుడైన దళితుడిపై చేయి చేసుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు ఎం.నాగరాజు డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిజనిర్ధారణ కమిటీ విచారణ ప్రారంభించిందని చెప్పారు. స్థానిక అబిద్‌సెంటర్‌లో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి ఆదివారం ఆయన పూలమాల వేసి నివాళుల ర్పించారు. అనంతరం మాట్లాడుతూ అమ్మవారి జాతరలో డప్పుకొట్టిన కళాకారుడిపై స్పీకర్ చేయిచేసుకోవడం దారుణమన్నారు. సమాజానికి స్పీకర్ ఇచ్చే సందేశం ఇదేనా అని ప్రశ్నించారు. స్పీకర్ కొడుతుంటే అక్కడే ఉన్న పోలీసులు పేక్షకపాత్ర వహించటం తగదన్నారు. తప్పును కప్పి పుచ్చుకునేందుకు బాధితుడితో బలవంతంగా స్టేట్‌మెంట్ ఇప్పించారని ఆరోపించారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడంతో పాటు సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. స్పీకర్ స్థాయి వ్యక్తులు ఈ విధంగా వ్యవహరించడం వల్లే సమాజంలో దళితులపై దాడులు నానాటికి పెరుగుతున్నాయన్నారు. ఈ ఘటనను అన్ని వర్గాల వారు ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.సురేష్, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మల్లిబాబు, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు చిందాడ నూకేశ్వరరావు, నియోజకవర్గ కన్వీనర్ లోకేష్, ఎంఎస్‌పీ నియోజకవర్గ కన్వీనర్ ఎం.సతీష్ తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు
న్యాయమూర్తి నరేష్ దంపతులకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేస్తున్న
ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ తదితరులు
అన్యాయంగా భూములు లాక్కొంటున్నారు
మా కుటుంబానికి చెందిన 30 సెంట్ల భూమిని ఏపీఐఐసీ వారు నేరుగా కొనుగోలు చేశారు. మా నాన్న బతికి ఉన్నప్పుడు కేవలం 10 సెంట్లకు మాత్రమే నష్టపరిహారం చెల్లించారు. మిగిలిన భూమికి నష్టపరిహారం ఇవ్వాలని ఏడేళ్లనుంచి నేను దరఖాస్తు చేస్తూ ఏపీఐఐసీ అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. మాకు ఇవ్వాల్సిన డబ్బులు వేరొకరి ఖాతాలో జమ చేశామని చెబుతున్నారు. ఇదెక్కడి అన్యాయం. వారి ఖాతాలో వేసిన డబ్బులు వాపసుతీసుకుని మా ఖాతలో వేయాలని కోరుతున్నా పట్టించుకోకపోగా రెండు రోజుల క్రితం దౌర్జన్యంగా మా భూమిలో కొబ్బరి తోటలు తొలగించారు.అడ్డుకున్న మాపై పోలీసు కేసులు పెట్టారు. ఇది చాలా అన్యాయం. భయపెట్టి బలవంతంగా భూములు లాక్కొవాలని చూస్తున్నారు.
– యలమంచలి రమేష్, బాధిత రైతు


