దేవరాపల్లి: మండలంలోని ఎం.అలమండలో నూకాంబిక అమ్మవారి జాతర (ఒడ్డు పండగ)ను ఈ నెల 17న భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు మాజీ సర్పంచ్‌లు దాడి జగన్, పోతల లక్ష్మీశంకర్ తెలిపారు. గ్రామ పెద్దలు, ప్రజలతో పండగ ఏర్పాట్లపై ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు జిల్లాల నుంచి వచ్చే సుమారు 70కు పైగా మహిళా కోలాట బృందాలు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ పండగలో ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బృందాలను విజేతలుగా ప్రకటించి బహుమతులను అందజేస్తామని తెలిపారు. మధ్యాహ్నం భారీ ఎత్తున ఎడ్ల పరుగు పోటీ నిర్వహించి విజేతలకు నగదు బహుమతులను అందజేస్తామన్నారు. దేవతామూర్తుల వేషధారణలతో అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నట్టు చెప్పారు. అదే రోజు రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వారు తెలిపారు.


