ఆంధ్రాకు! | - | Sakshi
Sakshi News home page

ఆంధ్రాకు!

Apr 6 2026 7:36 AM | Updated on Apr 6 2026 7:36 AM

ఒడిశాకు..
కొసరు
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ సరిహద్దుల విభజనలో బోర్డు ‘తొండాట’ కేవలం 7 స్టేషన్లను మాత్రమే విశాఖ డివిజన్‌లో కలిపినట్లు ప్రకటన రూ.వేల కోట్ల ఆదాయం ఇచ్చే కేకే లైన్‌పై పట్టు విడవని ఒడిశా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో కూటమి ఎంపీల మౌనం రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీల పోరాటం

రాయగడ డివిజన్‌ పరిధి

వాల్తేరులోని అత్యంత కీలకమైన కొత్తవలస–బచెలి (కేకే లైన్‌), కూనేరు–తేరువలి జంక్షన్‌, సింగాపూర్‌–కోరాపుట్‌ జంక్షన్‌, పర్లాకిమిడి–గుణుపూర్‌ స్టేషన్ల మధ్య ఉన్న సుమారు 680 కిలోమీటర్ల సెక్షన్‌.

విశాఖపట్నం డివిజన్‌ పరిధి

లాస–విశాఖపట్నం–దువ్వాడ, కూనేరు–విజయనగరం, నౌపడ జంక్షన్‌–పర్లాకిమిడి, బొబ్బిలి జంక్షన్‌–సాలూరు, సింహాచలం నార్త్‌–దువ్వాడ బైపాస్‌, వడ్లపూడి–దువ్వాడ, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌–జగ్గయ్యపాలెం స్టేషన్ల మధ్య ఉన్న సుమారు 410 కిలోమీటర్ల సెక్షన్‌.

సాక్షి, విశాఖపట్నం : దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్ర ప్రజలు కంటున్న కల ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌’. ఈ కల నెరవేరే సమయం ఆసన్నమైనా, ఆ సంతోషం ఉత్తరాంధ్ర ప్రజల్లో కనిపించడం లేదు. రైల్వే బోర్డు అనుసరిస్తున్న ‘సరిహద్దుల విభజన’ విధానమే ఇందుకు ప్రధాన కారణం. విశాఖపట్నం కేంద్రంగా కొత్త జోన్‌ వస్తుందని సంబరపడే లోపే, ఆ జోన్‌కు గుండెకాయ లాంటి ‘వాల్తేరు డివిజన్‌’ను ముక్కలు చేసి, అత్యంత కీలకమైన ప్రాంతాలను ఒడిశాలోని రాయగడ డివిజన్‌కు కట్టబెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా కేవలం ఏడు స్టేషన్లను మాత్రమే విశాఖ డివిజన్‌లో కలుపుతూ రైల్వే బోర్డు జారీ చేసిన ఉత్తర్వులు, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనన్న విమర్శలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

విభజన రాజకీయం.. వాల్తేరుపై వేటు

2014 ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. 2019 ఫిబ్రవరిలో విశాఖపట్నం కేంద్రంగా ’దక్షిణ కోస్తా రైల్వే జోన్‌’ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ ప్రకటనతో పాటే శతాబ్ద కాలపు చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్‌ను విభజిస్తున్నట్లు వెల్లడించడంతో అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. వాల్తేరు డివిజన్‌ను యథాతథంగా కొనసాగించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు రైల్వే మంత్రికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం, 2019 ఆగస్టులో వాల్తేరు డివిజన్‌ పేరును ‘విశాఖపట్నం డివిజన్‌’గా మారుస్తామని హామీ ఇచ్చి అమలు చేసింది. కానీ ఆ తర్వాత కూడా కీలకమైన కేకే లైన్‌ను రాయగడ డివిజన్‌లోనే చేర్చింది. దీనిని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న వైఎస్సార్‌సీపీ.. కేంద్రానికి, రైల్వే బోర్డుకు విన్నవిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో డివిజన్‌ విభజన అంశాన్ని కేంద్రం కొంతకాలం వాయిదా వేసింది. అనంతరం 2025 జనవరి 8న విశాఖలోని ముడసర్లోవలో జోన్‌ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ప్రతిపాదిత దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పరిధిలో వాల్తేరు డివిజన్‌ను విడగొడుతూ అధికార పరిధిని ఖరారు చేశారు.

ఏడు స్టేషన్ల ‘బిచ్చం’.. కూటమి ఎంపీల మౌనం

తాజాగా రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రామేశ్వర్‌ మీనా ఉత్తర్వుల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఉన్న పలాస, సుమ్మాదేవి, మందస రోడ్డు, బారువ, సోంపేట, జాడుపూడి, ఇచ్ఛాపురం స్టేషన్లను మాత్రమే విశాఖ డివిజన్‌లో కలుపుతున్నారు. మరోవైపు కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన ఎంపీల మౌనం విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్ర ఆదాయానికి మూలాధారమైన కేకే లైన్‌ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో వీరు పూర్తిగా విఫలమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు సైతం ఈ విషయంలో మిన్నకుండిపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇకనైనా కళ్లు తెరవకుంటే..

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. సరిహద్దుల నిర్ణయంలో గనుక ఇప్పుడు వెనక్కి తగ్గితే, భవిష్యత్తులో విశాఖ జోన్‌ ఆర్థికంగా నిలదొక్కుకోవడం అసాధ్యం. కేవలం ఏడు స్టేషన్ల బదిలీతో సంతృప్తి చెందితే, వేల కోట్ల ఆదాయాన్ని పొరుగు రాష్ట్రానికి ధారపోసినట్లే అవుతుంది. ఈ అంశంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు నిరంతరం పోరాటం చేస్తున్నప్పటికీ, అధికార కూటమి ఎంపీల నుంచి స్పందన లేకపోవడం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారింది.

చేజారుతున్న ‘బంగారు బాతు’

వివాదమంతా కొత్తవలస – కిరండూల్‌ (కేకే లైన్‌) చుట్టూనే తిరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, పోర్టుకు తరలించే ఈ మార్గం భారత రైల్వేలోనే అత్యధిక ఆదాయం ఇచ్చే సెక్షన్లలో ఒకటి. ఈ ఒక్క లైన్‌ ద్వారానే ఏడాదికి సుమారు రూ. 9 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఈ ఆదాయం ఒడిశా కేంద్రంగా ఉన్న ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేకు వెళ్తోంది. కొత్త జోన్‌ వస్తే ఈ ఆదాయం ఏపీకి చెందుతుందన్న భయంతో, ఒడిశా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ లైన్‌ను రాయగడ డివిజన్‌లో కలిపించుకుంది. రైల్వే బోర్డు కూడా ఒడిశా ఒత్తిళ్లకు తలొగ్గి, లాభసాటి మార్గాలను అక్కడ ఉంచి.. కేవలం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండి, నిర్వహణ ఖర్చులు భారమయ్యే స్టేషన్లను మాత్రమే ఆంధ్రాకు కేటాయిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement