దేవరాపల్లి: మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు మదనగురువులో గిరిజనులు మంచినీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. తాగునీటి సదుపాయం లేకపోవడంతో గ్రామానికి దూరంగా ఉన్న గెడ్డలో ఊట నీరే తమకు శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కలెక్టర్ స్పందించి తక్షణమే తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం చేతులు జోడించి వేడుకున్నారు. వీరికి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న, మండల కార్యదర్శి బి.టి. దొర మద్దతు పలికారు. అటవీ ప్రాంతంలో జీవిస్తున్న గిరిజనులను అడవి జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని సీపీఎం నాయకులు విమర్శించారు. గిరిజనులను ఉద్ధరించేందుకు అడవి బాట పట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఇక్కడ కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గెడ్డలో కలుషిత నీరు తాగడం వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ తదితర విష జ్వరాల బారినపడుతున్నారని వాపోయారు. ప్రభుత్వ పాలకులు యుద్ధప్రాతిపదికన స్పందించి మంచినీటి సదుపాయం కల్పించాలని, లేకుంటే వచ్చే నెల 2న కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని బాధిత గిరిజనులు హెచ్చరించారు. కార్యక్రమంలో పాంగి కన్నయ్య, పాంగి రామన్న, మామిడి చిన్నయ్య, పాంగి పెద భీమన్న, పాంగి చిన బీరాజు, పాంగి సన్యాసమ్మ, పి. దేముడమ్మ, సూకురి లక్ష్మి, మామిడి సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం స్పందించి
సమస్య పరిష్కరించాలి నిరసన


