ఎంవీపీకాలనీ: నగరంలోని కమ్యూనిటీ ప్రాంతాల అభివృద్ధికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఆదివారం ఎంవీపీకాలనీలోని అప్పుఘర్, వాసవానిపాలెం సాగర తీర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్లూమ్‌బర్గ్ ఫిలాంత్రోపీస్ 2025–2026 మేయర్స్ చాలెంజ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంపికై న 24 నగరాల్లో విశాఖ ఒకటిగా నిలవడం గర్వకారణమన్నారు. ఈ విజయం ఫలితంగా నగరంలో ‘వి–పుల్’(విశాఖ–ప్రజాముఖి అర్బన్ లివింగ్ ల్యాబ్) కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున కమ్యూనిటీ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. పర్యటనలో భాగంగా శివగణేష్‌నగర్, వాసవానిపాలెంలోని మత్స్యకారులతో మాట్లాడి, ఆయా ప్రాంతాల్లోని సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు, కాలువల మరమ్మతులతో పాటు గ్రీన్ బెల్ట్‌లను అభివృద్ధి చేయాలని మత్స్యకార గ్రామాల పెద్దలు కమిషనర్‌కు విన్నవించారు. ‘వి–పుల్’ద్వారా ప్రజా భాగస్వామ్యంతో ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ సిద్ధంగా ఉందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. జెడ్సీ శివప్రసాద్, వైద్యాధికారి ప్రసాదరావు, పలువురు వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్


