శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. శ్రీమహా విష్ణువు అవతారమైన శ్రీవరాహ లక్ష్మీనసింహస్వామిని పెళ్లికుమారుడిగా, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పెళ్లికుమార్తెలుగా అలంకరించి నిర్వహించిన ఈ వేడుకను చూసి భక్తులు పులకించిపోయారు. నృసింహ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
కొట్నాల ఉత్సవంతో ప్రారంభం
పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచే కల్యాణోత్సవ ఘట్టాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద అర్చకులు, ముత్తయిదువలు పసుపుకొమ్ములను దంచి కొట్నాల ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణం చేపట్టారు. ముక్కోటి దేవతలను కల్యాణోత్సవానికి ఆహ్వానిస్తూ ధ్వజస్తంభంపై గరుడాళ్వార్ చిత్రపటాన్ని అర్చకులు ఎగురవేశారు.
రసవత్తరంగా ఎదురు సన్నాహోత్సవం
కల్యాణ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఎదురు సన్నాహోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని బంగారు వర్ణపు పల్లకీలో, అమ్మవార్లను ముత్యాల పల్లకీలో వేంచేపు చేశారు. సింహగిరి మాడ వీధుల్లో పల్లకీలను ఊరేగిస్తూ, పశ్చిమ మాడ వీధిలోని జోడు భద్రాల వద్ద ఎదురెదురుగా ఉంచారు. స్వా మి, అమ్మవార్ల వైభవాన్ని చాటిచెబుతూ సాగిన ఈ కార్యక్రమం రసవత్తరంగా సాగింది. అర్చకులు పూలదండలతో నృత్యాలు చేస్తూ ఉత్సవాన్ని రక్తి కట్టించారు. పుల్లెల సత్యనారాయణ శర్మ, ముష్టి పవన్ కుమార్ శర్మ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
హోరెత్తిన రథోత్సవం
సింహగిరి మాడ వీధుల్లో నిర్వహించిన రథోత్సవం కనులవిందుగా సాగింది. ఉత్సవమూర్తులను రథంపై అధిష్టింపజేశారు. జాలరి పెద్ద కదిరి లక్ష్మణరావు రథ సారథిగా వ్యవహరించగా, విశాఖ నలుమూ లల నుంచి అమ్మవారి బంధువులుగా వచ్చిన జాలర్లు రథాన్ని లాగే బాధ్యతను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తు లు రథం తాళ్లను లాగుతూ స్వామి వారిని సేవించుకున్నారు.
కనులపండువగా కల్యాణోత్సవం
ఉత్తర రాజగోపురం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో రాత్రి 10.30 గంటలకు స్వామి వార్షిక కల్యాణోత్సవం ప్రారంభమైంది. రథోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లను కల్యాణ ప్రాంగణంలోకి తీసుకొచ్చి, కల్యాణ వేదికపై వేంచేపు చేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్పం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ వేడుకలను దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యుల పర్యవేక్షణలో అర్చక బృందం నిర్వహించారు. ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాతలు రాంభట్ల నృసింహశర్మ, శేషాచారి వ్యాఖ్యానం అందించారు. దేవస్థానం ఈవో జె. వెంకటరావు ఏర్పాట్లను పర్యవేక్షించగా, గోపాలపట్నం సీఐ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.
నయనానందకరంగా అప్పన్న వార్షిక కల్యాణోత్సవం
విశేషంగా ఎదురు సన్నాహోత్సవం
పరవశించిన భక్తజనం
ఆధ్యాత్మిక కాంతులతో విరాజిల్లిన సింహగిరి
తిరువీధిలో రథోత్సవం


