అన్నదాతల్లో సోలార్‌ పవర్రీ | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల్లో సోలార్‌ పవర్రీ

Mar 26 2026 7:38 AM | Updated on Mar 26 2026 7:38 AM

262 ఎకరాల్లో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు

రైతులకు ఆ భూమే ఆధారం... కాయకష్టంతో పంటలు పండించి కుటుంబాలను పోషించుకుంటున్నారు... ఇప్పుడా భూముల్లో పీఎం సుకుమ్‌ పథకంలో భాగంగా సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. చీడికాడ మండలంలోని నాలుగు గ్రామాల్లో సర్వే, భూ సేకరణ చేస్తున్నారు. దీంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్లాంట్‌ ఏర్పాటుకు తమ భూములిచ్చే ప్రసక్తే లేదని కరాఖండీగా చెబుతున్నా... వివిధ కారణాలు చెబుతూ అధికారులు సర్వే చేస్తుండడంతో రైతుల్లో గుబులు రేపుతోంది.

సాక్షి, అనకాపల్లి: జిల్లాలో చీడికాడ, బుచ్చెయ్యపేట మండలాల్లో 262 ఎకరాల్లో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు కోసం రెవెన్యూ అధికారులు భూసేకరణ చేపట్టారు. గత నెల రోజుల్లో చీడికాడ మండలంలో బైలపూడి, ఎ.అగ్రహారం గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలను రైతులు అడ్డుకున్నారు. అంతేకాకుండా తమ భూములు ఇచ్చేది లేదంటూ గ్రామసభల్లో, పీజీఆర్‌ఎస్‌లో రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. పూర్వం నుంచి సాగులో ఉన్న పంట భూములకు ప్రభుత్వం డీ– పట్టాలు అందించింది. వాటిలో వరి, వేరుశనగ, అపరాలు, కందులు, ఆయిల్‌పామ్‌ సాగుచేస్తున్నారు. పంటలు పండే భూములను ప్రాజెక్టు కోసమంటూ తీసుకుంటే..మాకు జీవనాధారం ఉండదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులపై అన్నదాతల ఆగ్రహం

ఇటీవల భూముల సర్వే నిర్వహించేందుకు వచ్చిన అధికారులను చీడికాడ మండలంలో బైలపూడి, ఎ.అగ్రహారం గ్రామాల్లో రైతులు అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీఆర్‌ఎస్‌లో వినతి పత్రాలు అందించినా మా ప్రమేయం లేకుండా సర్వే నిర్వహించేందుకు ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. అయితే ఎటువంటి సమాధానం చెప్పకుండా మండల సర్వేయర్‌, రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. జిల్లాలో విద్యుత్‌ అదనపులోడ్‌ను అధిగమించేందుకు ‘ప్రధాన మంత్రి కిసాన్‌ ఉర్జా సురక్ష ఏవం ఉత్తాన్‌ మహాభియాన్‌(పీఎం–కుసుమ్‌)’ ప్రాజెక్టులో భాగంగా మెగా ఇంజినీరింగ్‌ సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లోనే విద్యుత్‌ వినియోగం అధికంగా ఉండడంతో ఈ సమస్యను అధిగమించడానికి సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నారు. మెగా ఇంజినీరింగ్‌ సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుకు జిల్లాలో చీడికాడ, బుచ్చెయ్యపేట మండలాల్లో 262 ఎకరాల్లో డీ పట్టా భూములు గుర్తించారు. వీటిలో చీడికాడ మండలంలోని 162 ఎకరాల్లో సర్వే చేస్తూ, గ్రామ సభలు నిర్వహిస్తున్నారు.

ఐదు గ్రామాల్లో : చీడికాడ మండలంలో జి.కొత్తపల్లిలో సర్వే నం 166, 167లో 40 ఎకరాలు, అడవిల అగ్రహారంలో సర్వే నంబర్‌ 63లో 55 ఎకరాలు,బైర్లపూడిలో సర్వే నంబర్‌ 122లో 60 ఎకరాలు, చిన్న గోగాడలో సర్వే నంబర్‌ 2లో 70 ఎకరాలు, బుచ్చెయ్యపేట మండలంలో కోమలపూడి గ్రామంలో 37 ఎకరాల డీ పట్టా భూములను గుర్తించి, పవర్‌ప్లాంట్‌కు కేటాయించనున్నారు. అయితే సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ కోసం తమ పొట్ట కొట్టవద్దని ఆయా గ్రామాల రైతులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. భూములిచ్చే ప్రసక్తే లేదని గ్రామసభల్లో కరాఖండీగా చెప్పడంతో పాటు సర్వేకు వచ్చిన సిబ్బంది అడ్డుకున్నారు. పీజీఆర్‌ఎస్‌లో కూడా అర్జీలు అందజేశారు. ఇంతలా రైతులు వ్యతిరేకిస్తున్నా అధికారులు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక కారణం చెబుతూ భూముల సర్వేకు యత్నిస్తున్నారు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

చీడికాడ మండలంలో సర్వే

ప్రాజెక్టుకు పంట పొలాలు ఇచ్చేది లేదంటున్న రైతులు

గ్రామసభల్లో తహసీల్దార్‌కు వినతి పత్రాలు అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement