ఏజెన్సీల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న జనం
మాడుగులలో ఖాళీ సిలిండర్లతో గ్యాస్ గోదాం వద్ద క్యూ
బుక్ చేసినా రోజుల తరబడి వేచి ఉండాల్సిందే..
మారుమూల గ్రామాల ప్రజలకు మరిన్ని తిప్పలు
మాడుగుల రూరల్ : వినియోగదారులకు గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. మాడుగుల హైస్కూలు సమీపంలో గల సీతారామ భారత్ గ్యాస్ గోదాం వద్ద బుధవారం వందలాది మంది వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో గ్యాస్ ఏజెన్సీ ఎదుట క్యూ కట్టారు. ఒకవైపు గ్యాస్ కొరత లేదని బుక్ చేసుకున్న వారికి గ్యాస్ అందజేస్తామని ప్రభుత్వం చెబుతుండగా, క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. గ్యాస్ దొరుకుతుందా లేదా అన్న ఆదుర్దాతో మహిళలు, యువకులు గంటల తరబడి క్యూలో నిల్చుని నానా అవస్దలు పడ్డారు. ఈ నెల 20 వ తేదీలోపు గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదార్లకే గ్యాస్ బండలు పంపిణీ చేస్తామని స్థానిక గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వారికి తేల్చి చెప్పారు. కానీ భవిష్యత్తులో గ్యాస్ దొరకదనే ఆందోళన ప్రజల్లో నెలకొనడంతో అందరూ ఒక్కసారిగా గ్యాస్ ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సుమారు 500 మంది వినియోగదారులు బుధవారం ఒక్కరోజే ఉదయం నుంచి ఖాళీ సిలిండర్లతో రోడ్డు మీద క్యూ కట్టారు. ఒకేసారి వినియోగదారులు వందలాది మంది భారత్ గ్యాస్ గోదాం వద్దకు రావడంతో ఎటువంటి గొడవలు జరగకుండా ఎస్‌ఐ జి.నారాయణరావు, సిబ్బంది వచ్చి వారిని క్యూలో పెట్టారు. 300 గ్యాస్ సిలిండర్లు బుధవారం పంపిణీ చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. 20 వ తేదీ తర్వాత గ్యాస్ బుక్ చేసుకున్న వారికి టోకెన్లు అందజేసి, గ్యాస్ వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పారు. మండలంలో మారుమూల గ్రామాల ప్రజలకు మరిన్ని తిప్పలు తప్పడం లేదు. వారంతా ఖాలీ సిలిండర్లను ఆటోలు, బైక్‌లు మీద తీసుకుని వచ్చి గంటల తరబడి వేచి ఉన్నా గ్యాస్ దొరక్క పోవడంతో ఉసూరుమని ఇంటిముఖం పట్టారు. ఐదు రోజులుగా గ్యాస్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నామని క్యూలోని మహిళలు, వృద్ధులు తమ కష్టాలు ఏకరువు పెట్టారు.రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులతో పాటు, కనీసం గ్యాస్ కూడా అందించలేని స్దితిలో ఉందని పలువురు మహిళలు మండిపడ్డారు.
గ్యాస్ కష్టాలు తీర్చాలి...
రాష్టంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వచ్చాక నిత్యావసర ధరలు పెంచారు. దీనికి తోడు ప్రజలకు అతి ముఖ్యమైన గ్యాస్ కూడా సకాలంలో అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుత పరిస్థితిలో గ్యాస్ వినియోగదారులు అందరికీ గ్యాస్ సిలిండర్లు అందేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గ్యాస్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ గ్యాస్ అందించాలి.
–శోలం రమేశ్, వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు, శంకరం గ్రామ సర్పంచ్, మాడుగుల మండలం


