ఎమ్మెల్యే రాజు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల వర్గీయుల మధ్య వర్గపోరు
రోడ్డు పనులు చేపట్టిన ఎమ్మెల్యే రాజు వర్గీయులు
నేలపై బైఠాయించి అడ్డుకున్న బత్తుల వర్గీయులు
వడ్డాదిలో రోడ్డు వేయకుండా నేలపై బైఠాయించిన బత్తుల వర్గీయులు
వడ్డాదిలో గొడవ పడుతున్న ఇరువర్గాలను
చెదరగొడుతున్న పోలీసులు
బుచ్చెయ్యపేట : మేజర్ పంచాయతీ వడ్డాది టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వడ్డాదిలో సిమెంట్ రోడ్ల ఏర్పాటులో ఎమ్మెల్యే రాజు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు వర్గీయుల మధ్య తార స్థాయికి వర్గ విభేదాలు చేరాయి. రోడ్డు వేయాలని ఎమ్మెల్యే రాజు వర్గీయులు, మాకు సమాచారం లేకుండా రోడ్లు ఎలా వేస్తారు అంటూ తాతయ్యబాబు వర్గీయులు భీష్మించి తోపులాటకు దిగారు. వడ్డాదిలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రూ.55 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈ నెల 22న ఎమ్మెల్యే రాజు రోడ్లు వేయడానికి శంకుస్థాపన చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తన సొంత గ్రామంలోనే తనకు చెప్పకుండా సిమ్మెంట్ రోడ్ల శంకుస్ధాపన కార్యక్రమం చేయడంపై తాతయ్యబాబుతో పాటు అతని వర్గీయులు ఆగ్రహం చెందారు. బుధవారం సిమెంట్ రోడ్డు వేయడానికి కూలీలు రాగా తాతయ్యబాబు వర్గీయులు దొండా నరేష్, రమేష్, కన్నబాబు, శంకర్, గురుమూర్తి, సయ్యపురెడ్డి మాధవరావు, ముత్యాల సూరిబాబు అడ్డుకున్నారు. రోడ్డు వేసి తీరుతామని ఎమ్మెల్యే వర్గీయులు దొండా సన్యాసిరావు, దొండా గిరిబాబు, శిరిగిరిశెట్టి శ్రీరామూర్తి, కుబిరెడ్డి వెంకటరావు, వీర్ల సురేష్, అదట్రా రమేష్, ఈఽశ్వరరావు, సింగంపల్లి రమేష్ తదితరులు అడ్డు తగిలారు. దీంతో ఇరువర్గాల మధ్యన తీవ్ర వాగ్వాదం జరిగి కొట్లాటకు దిగబోయారు. దీంతో బుచ్చెయ్యపేట ఎస్‌ఐ శ్రీనివాసరావు తమ సిబ్బందితో వచ్చి ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో టీడీపీ అధికారంలో లేనపుడు నాలుగేళ్లు పార్టీ గురించి పట్టించుకోని ఎమ్మెల్యే రాజు ఈ రోజు వడ్డాదిలో గ్రూపు రాజకీయాలు చేస్తున్నాడని తాతయ్యబాబు వర్గీయులు ఆగ్రహం చెందగా, నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తుంటే పనులు అడ్డుకోవడమేంటని ఎమ్మెల్యే రాజు వర్గీయులు ఎదురు తిరిగారు. మోదకొండమ్మ ఆలయ చైర్మన్ దొండా గిరిబాబు స్వయంగా ఇసుక మోసి రోడ్డు వేయండని కోరగా, హౌసింగ్ బోర్డు చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వచ్చే వరకు రోడ్డు వేయొద్దని గ్రామ టౌన్ టీడీపీ అధ్యక్షుడు దొండా నరేష్ ఎదురు తిరిగారు. సుమారు 15 మంది పోలీసులతో గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రోడ్డు పనులు చేపట్టకుండానే కూలీలు వెళ్లిపోవడంతో ఇరువర్గాల వారు వెనుదిరిగారు. రాత్రికి గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.


