తాళాలు వేసి ఉన్న మెప్మా కార్యాలయం
నర్సీపట్నం : మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లిలో ఉన్న మెప్మా కార్యాలయం బుధవారం మూతపడింది. సెలవు దినం అనుకుంటే పొరపాటే. మెప్మా సిబ్బంది కార్యాలయానికి సెలవు ప్రకటించేశారు. బాధ్యతగా విధులు నిర్వర్తించాల్సిన మెప్మా సిబ్బంది రోజంతా డుమ్మా కొట్టారు. ఒక్కరు కూడా కార్యాలయంలో లేకుండా తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. ఈ కార్యాలయం ఇరుకు సందులో మారుమూలన ఉండడం వల్ల మెప్మా సిబ్బందికి కలిసొచ్చింది. దీంతో కార్యాలయం ఎప్పుడు తెరిచి ఉంటుందో తెలియని పరిస్థితి. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన మహిళలు తాళాలు వేసి ఉండడంతో వెనుదిరిగారని చుట్టుపక్కలవారు తెలిపారు. సీవో లేకపోతే కనీసం సిబ్బంది అయినా కార్యాలయంలో అందుబాటులో ఉండాలి. కానీ కార్యాలయానికి తాళాలు వేసేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో మెప్మా సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. మెప్మా సిబ్బంది దర్జాగా తాళాలు వేసుకుని వెళ్లిపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మెప్మా కోఆర్డినేటర్ రమాదేవిని వివరణ కోరగా యలమంచిలిలో జరిగిన పీడీ రివ్యూ మీటింగ్‌కు వెళ్లామని, ఈ విషయాన్ని కమిషనర్ దృష్టిలో పెట్టామని ఆమె తెలిపారు.


