నర్సీపట్నం: పెద్ద చెరువు ఆక్రమణపై ప్రశ్నించిన రైతులపై స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు వేధింపులకు పాల్పడడం సరికాదని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్పీకర్ నిరంకుశ నిర్ణయాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చెరువులో అక్రమ నిర్మాణాలపై ఆయకట్టు రైతులు తన దృష్టికి తెస్తే, వారందరిపై స్పీకర్ వేధింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇరిగేషన్ భూమిని ఆక్రమించారంటూ సుర్ల బెన్నయ్యనాయుడు సాగు చేసుకుంటున్న సరుగుడు తోటను రెవెన్యూ అధికారులు ధ్వంసం చేసి, హద్దులు వేశారన్నారు. బలిఘట్టం 18వ వార్డు వైఎస్సార్‌సీపీ వార్డు ఇన్‌చార్జి సుర్ల నాయుడు ఇళ్లు ఇరిగేషన్ కాలువలో ఉందని రెవెన్యూ అధికారులు మార్కింగ్ ఇచ్చారన్నారు. స్పీకర్ ఆదేశాలతో తహసీల్దార్ రామారావు ఈ విధంగా రైతులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహించారు. కనీసం ఆయకట్టు రైతులను సంప్రదించకుండా స్పీకర్ సొంత జాగీరులా చెరువు గర్భం రూపురేఖలు మార్చేస్తుంటే రైతులు ప్రశ్నించడంలో తప్పు ఏముందన్నారు. రాజ్యాంగ పదవీలో ఉన్న స్పీకర్ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. తహసీల్దార్, ఆర్డీవో, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు చెరువులో ఏమి జరుగుతుందో కనపడడం లేదా అని ప్రశ్నించారు. నిజమైన శివ భక్తుడువైతే స్థలం కొని 108 అడుగుల శివపార్వతుల విగ్రహన్ని ప్రతిష్టిస్తే సంతోషిస్తామన్నారు. ఇదే చెరువు స్థలంలో ఆటోనగర్ పెడతామని అయ్యన్నపాత్రుడు ప్రకటించారన్నారు. ఈ విషయంపై కోర్టు స్టే ఇచ్చిందన్నారు. ఆటోనగర్ ఏమైందో స్పీకర్ సమాధానం చెప్పాలన్నారు. స్పీకర్, ఆయన తనయుడు విజయ్ లేటరైట్, రోలుగుంట క్వారీల పేరుతో రూ.వందల కోట్లు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. కూటమి నాయకుల పేరుతో లేటరైట్‌ను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. రూ.వందల కోట్లు దోచి పెడుతున్ననందున తనకు రాజ్యసభ సీటు వస్తోందని, అప్పుడు వైఎస్సార్‌సీపీ నాయకులను గడగడలాడిస్తానని స్పీకర్ తనయుడు ప్రగల్భాలు పలకడం హేయమన్నారు. ఇలాంటి వ్యక్తికి రాజ్యసీటు ఇస్తే ప్రభుత్వ పెద్దలకు లేటరైట్ ముసుగులో రూ.వందల కోట్లు ముడుతున్నాయన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. స్పీకర్‌కు చిత్తశుద్ధి ఉంటే బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలో శివపార్వతుల విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. ఆలయంతోపాటు ఆ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నారు. నాతవరం మండలంలో గుడి కడుతుంటే ఇదే స్పీకర్ కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని ఆరోపించారు. పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాలపై ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, పార్టీ టౌన్ అధ్యక్షుడు ఏకా శివ పాల్గొన్నారు.


