మామిడి రైతుకు గుండె కోత | - | Sakshi
Sakshi News home page

మామిడి రైతుకు గుండె కోత

Mar 25 2026 7:10 AM | Updated on Mar 25 2026 7:10 AM

● ఈదురుగాలులు, భారీ వర్షాలకు తీవ్ర పంట నష్టం ● ఇప్పటికే చాలా పంట నేలరాలిన వైనం ● ఆందోళన చెందుతున్న రైతులు

చోడవరం : ఈదురుగాలులు బీభత్సం, తుఫాన్‌ భారీ వర్షాలతో మామిడి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈ ఏడాది మామిడి పంటకు కోలుకోలేని దెబ్బతగిలింది. సరిగ్గా కాయ దిగుబడి సమయంలోనే పంటకు తీవ్రనష్టం కలిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, ఈదురు గాలులకు పక్వానికి వచ్చిన మామిడి కాయ నేలరాలింది. జిల్లాలో సుమారు 1000 ఎకరాల్లో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో మామిడి కాయలు చాలా మేర నేలరాలిపోయాయి. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, అనకాపల్లి, పాయకరావుపేట, యలమంచిలి నియోజవకర్గాల్లో సుమారు లక్షా 50వేల ఎకరాల్లో మామిడి, జీడిమామిడి సాగు జరుగుతోంది. పంట ఇప్పుడే కాయదశకు వచ్చింది. ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు మామిడి పండును ఎగుమతి చేస్తుంటారు. దీనితో ఏటా మామిడి పంటపై ఆధారపడి సుమారు లక్ష కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ పరిస్థితిలో గాలివానలకు చేతికందిన పంట నేలరాలడంతో రైతులు, లీజుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాయలు నేలమీద పడి చిదికిపోవడం వల్ల అమ్మకానికి పనికిరాని పరిస్థితి ఏర్పడింది. అసలే ఈ ఏడాది ఆలస్యంగా పూత రావడం, ప్రస్తుతం కేవలం 40శాతం మాత్రమే కాయ నిలబడింది. అదికూడా ప్రస్తుతం కాయ దశకు చేరుకుంటుంది. పండిన పంటలో 30 శాతం గాలివానల బారిన పడడంతో రైతులు చాలా నష్టపోయారు. ఈ నేలరాలిన కాయలు బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరలకు తెగనమ్ముకొంటున్నారు. అడ్డూరు, నర్సాపురం, వి.సంతపాలెం, చోడవరం, గొల్లలపాలెం, రోలుగుంట, రాంబిల్లి, యలమంచిలి, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల, నాతవరం, నర్సీపట్నం తదితర ప్రాంతాల నుంచి రైతు బజార్లకు రాలు కాయ భారీగా వచ్చింది. గుట్టలు పోసినంత పంట రాలిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. సరిగ్గా ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలోనే మామిడి దిగుబడి, పండ్ల ఎగుమతి జోరుగా సాగుతుంది. ఇలాంటి సమయంలో గాలివానతో మామిడి రైతు గుండె దిగాలు పడింది. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement