మాట్లాడుతున్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం డైరెక్టర్ ముకుందరావు
అనకాపల్లి టౌన్: జిల్లాలో ఈ నెల 25 నుంచి ఐదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం డైరెక్టర్ డాక్టర్ సిహెచ్. ముకుందరావు తెలిపారు. స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానం సమావేశ మందిరంలో వ్యవసాయాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వర్షాలను వినియోగించుకొని చిరుపొట్ట దశలో ఉన్న వరి పైరులో ఎకరాకు 35 కిలోల యూరియా, 20 కిలోల మ్యురేట్ ఆఫ్ పోటాష్ వేసుకోవాలన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు నువ్వుల్లో రసం పీల్చు పురుగులు ఆశించే అవకాశం ఉందన్నారు. నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీ గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. చెరకు ముచ్చేలు నాటిన 3 రోజుల లోపు కలుపు నివారణకు అట్రాజిన్ 2 కిలోలు 20 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. చెరకు పైరులో తొలి దశలో ఆశించే పీక పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే క్లొరాంట్రినిలిప్రోల్ 0.3 మిల్లీ గ్రాములు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల మామిడి పిందె రాలుతుందన్నారు. నివారణకు నాప్తాలిన్ అసిటిక్ ఆసిడ్ 2 మిల్లీగ్రాములను 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. సమావేశంలో డాక్టర్ కె.వి.రమణమూర్తి, డాక్టర్ డి. ఆదిలక్ష్మి, డాక్టర్ గౌరీ తదితరులు పాల్గొన్నారు.


